అసోం వరదలు తగ్గుముఖం పట్టడం లేదు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా మరో ఆరుగురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 85కి చేరింది.
రాష్ట్రంలో 26 జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 70 లక్షల మందికిపైగా ఇబ్బందులు పడుతున్నారు. కాజీరంగా జాతీయ పార్క్‌లోకి భారీగా నీరు చేరటం వల్ల 108 మూగజీవాలు మరణించాయి. మరి కొన్ని జంతువులు నీళ్లల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్.
"ప్రజలు ఓవైపు కొవిడ్‌తో పోరాడుతుంటే, మరో పక్క వరదలు వచ్చి మరింత అవస్థలకు గురి చేస్తున్నాయి. అస్సామీలు ఈ విపత్కర పరిస్థితులపై యుద్ధం చేసి విజయం సాధిస్తారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటూ అవసరమైన సాయాన్ని అందిస్తాయి."
-సర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రి.
రాష్ట్రవ్యాప్తంగా 2700 గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా, లక్ష హెక్టార్ల మేర పంట భూమి నీట మునిగింది.