కేరళ త్రిస్సూర్ జిల్లాలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఆసియాలోనే అతిపెద్ద జూలాజికల్ పార్క్ సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి అతిపెద్ద జూ విశేషాలు తెలుసుకుందామా..!
338 ఎకరాల విస్తీర్ణంలో..
సహజసిద్ధమైన ఈ జూలాజికల్ పార్క్‌ను 338 ఎకరాల (1.36 కిలోమీటర్ల మేర) విస్తీర్ణంలోని ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దీని ద్వారా వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుకలగనుంది. ఇప్పటికే జంతువులు ఆశ్రయం పొందేలా పార్క్‌లోని 23 ప్రాంతాల్లో తగిన ఆవాసాలు సిద్ధమయ్యాయి.
ప్రస్తుతం త్రిస్సూర్ జంతుప్రదర్శనశాల నగరానికి సమీపంలో తక్కువ విస్తీర్ణంలో ఉంది. అందులో ఉన్న సింహాలు, పులులు, పక్షులు ఇరుకైన ఆవాసాల్లో ఉన్నాయి. త్వరలోనే అవి సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జూ పార్కుకు వెళ్లనున్నాయి. అక్కడ అవి స్వేచ్ఛగా విహరించనున్నాయి. స్వేచ్ఛావిహారంలో జంతువుల విన్యాసాలు పర్యటకులు వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
డిసెంబర్‌లోపు..
అన్ని రకాల నిర్మాణ పనుల వేగంగా జరుగుతున్నాయని.. ఈ ఏడాది డిసెంబర్ లోపు మూడు దశల పనులు పూర్తవుతాయని అటవీ శాఖ మంత్రి కే రాజు తెలిపారు. ఆ తర్వాత జంతువులను కొత్త జూ లోకి తరలిస్తామన్నారు.
- తొలి దశలో సింహపు తోక మకావు, నీలగిరి లాంగూర్, అటవి దున్న సహా పక్షుల కోసం చేపట్టిన 4 అతిపెద్ద ఆవాసాల పనులు పూర్తయ్యాయి.
- రెండో దశలో 8 జంతువుల ఆవాస ప్రాంతాలు సహా నీటి సరఫరా, విద్యుత్ పనులు సాగుతున్నాయి.
- పర్యటక ప్రదేశంగానే కాక పరిశోధన కేంద్రంగానూ ఈ జూ పని చేయనుంది. దీనిని 9 జోన్లుగా విభజించారు. ఇప్పటికే ఈ జోన్లలో 10 లక్షల మొక్కలు నాటారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: మహిళపై కారు ఎక్కించిన ఎస్ఐ