రుతుపవనాల రాకకు ముందు దేశంలో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అధిక ఉష్టోగ్రతలతో దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రకటించింది.
ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు దేశ వ్యాప్తంగా 43.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం 59.6 మిల్లీమీటర్లు కంటే 16.3 శాతం తక్కువ. దీర్ఘకాల సరాసరి వర్షపాతంతో(ఎల్పీఏ) పోలిస్తే ఇది 27 శాతం తక్కువని పేర్కొంది. అత్యధికంగా వాయువ్య భారత్ (ఉత్తరప్రదేశ్, దిల్లీ, పంజాబ్, హరియాణా, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్) ప్రాంతంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ప్రకటించింది.
దక్షిణ ద్వీపకల్పంలోని 5 రాష్ట్రాలు, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో 31 శాతం... తూర్పు, ఈశాన్య భారతంలో 23 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయితే మధ్య భారత్లో మాత్రమే 5 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ తెలిపారు.
"ఉద్యాన పంటలకు రుతుపవనాల ముందు కురిసే వర్షం ఎంతో ముఖ్యం. ఒడిశా లాంటి రాష్ట్రాల్లోని రైతులు ఇప్పటికే పంటపొలాలను దుక్కి దున్నారు."
- మృతుంజయ్ మోహపత్రా, ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రుతుపవనాల రాకకు ముందు కురిసిన వర్షాలు, తుపానులు, పిడుగులతో దాదాపు 50 మంది దాకా మృత్యువాత పడ్డారు.
దేశంలోని పలుప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు తగ్గే సూచన కనిపించడం లేదని స్కైమెట్ వాతావరణ సంస్థ కూడా ప్రకటించడం గమనార్హం.