ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బంగాల్ సహా అన్ని రాష్ట్రాల్లో వైద్యుల సమ్మె ముగిసినందున అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భద్రతా సిబ్బందిని మోహరించాలన్న వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు జారీ చేయలేమని విచారణ సందర్భంగా జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, వైద్యులకు రక్షణ ముఖ్యమైన అంశమని పేర్కొంది.
" బంగాల్ సహా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు సమ్మె చేస్తున్నందుకు వ్యాజ్యాన్ని ఈ రోజు విచారించేందుకు అంగీకరించాం. అయితే ప్రస్తుతం సమ్మె ముగిసింది కాబట్టి ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదు. మరో ధర్మాసనం ముందుకు వ్యాజ్యం వెళుతుంది." -- ధర్మాసనం
భారత వైద్యుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను ప్రస్తావిస్తూ వైద్యులకు రక్షణ కల్పించడం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
"ఈ అంశం తీవ్రతను అర్థం చేసుకున్నాం. సామాన్యులను పణంగా పెట్టి వైద్యులకు రక్షణ కల్పించలేం. మేం విశాల దృక్పథంతో వ్యవహరించాలి. అయితే, వైద్యులకు రక్షణ కల్పించడానికి మేం వ్యతిరేకం కాదు. " -- ధర్మాసనం
బంగాల్లో గత వారం ఓ ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడి బంధువులు ఇద్దరు వైద్యులపై తీవ్రంగా దాడి చేశారు. ఆ ఘటనకు నిరసనగా తమకు రక్షణ కల్పించాలంటూ వైద్యులు ఆందోళన బాట పట్టారు. రక్షణ కల్పిస్తామని వైద్యులతో భేటీలో బంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. వైద్యులు సమ్మె విరమించి విధుల్లో చేరారు.
ఇదీ చూడండి : పుల్వామా దాడి పాత్రధారులు హతం