రషీదా సలీమ్.. కేరళ ఎర్నాకులం జిల్లా కొత్తమంగలం గ్రామ సర్పంచ్. ఆమెకు మొక్కలన్నా, వ్యవసాయమన్నా ఎనలేని అభిరుచి. అందుకే పంచాయతీ కార్యాలయంలోని స్థలంలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
అంతేకాదు తన ఇంటి పైకప్పు మీద కూరగాయల మొక్కలను పెంచుతూ మిగిలిన ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఖాళీ సమయాల్లో కూరగాయలను పండిస్తున్నారు.
"మొక్కలు పెంచేందుకు స్థలం లేక ఇంటి పైన ఉన్న ప్రదేశంలోనే కూరగాయల మొక్కలను పెంచుతున్నాం. మంచి దిగుబడి వచ్చింది. మిగిలినవారందరూ మొక్కల పెంపకం ప్రాధాన్యతను అర్థం చేసుకొని.. ప్రేరణగా తీసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటున్నా."- రషీదా సలీమ్, సర్పంచ్.
పంచాయతీ స్థలంలో
పంచాయతీకి సంబంధించిన ఖాళీ స్థలంలో కూరగాయలను పండించి మంచి దిగుబడిని సాధించారు. తన ఇంటి పైన కూడా కూరగాయలను పండించాలని నిర్ణయించుకున్నారు రషీదా. ఇంటి పైకప్పు మీద గ్రోబ్యాగ్స్, ప్లాస్టిక్ సంచులు, ఇతర డబ్బాలలో కూరగాయల మొక్కలను పండించటం మొదలు పెట్టారు. ఈ మొక్కలకు రక్షణగా గ్రీన్ టెంట్లను ఏర్పాటు చేశారు.
మొదటి ప్రయత్నం విఫలం
మొదటి సారి ఇంటి పైకప్పు మీద ఆమె కూరగాయలను పండించినప్పుడు దిగుబడి పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత ఆమె అనేక సంరక్షణ పద్దతులు పాటిస్తూ వివిధ రకాల కూరగాయలను పండిస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు.
కుటుంబ సభ్యుల సహకారం
రషీదాకు కుటుంబ సభ్యులూ సహకారం అందిస్తున్నారు. ఆమె భర్త ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయంలో కూరగాయలను పండించటంలో ఆమెకు తన వంతు సాయం చేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కొంత సమయాన్ని కూరగాయలను పండించటానికి ఉపయోగించాలని రషీదా చెబుతున్నారు.
ఇదీ చూడండి:భారత సైనికుల శబ్దానికే పాక్ బలగాల పరార్!