2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో అప్పటి కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక వ్యక్తి అరుణ్ జైట్లీ. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ.. జైట్లీ అభిప్రాయాలు తీసుకునేవారు ప్రధాని మోదీ.
నరేంద్ర మోదీకి ఇప్పుడు అమిత్ షా ఎలానో.. ఆ సమయంలో జైట్లీ ప్రధానితో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో.. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అరుణ్ జైట్లీ. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ముమ్మారు తలాక్ నిషేధం సమయాల్లో.. జైట్లీ పాత్ర ప్రధానం.
దీటుగా బదులిచ్చే నేత...
సొంత పార్టీని ఎన్నో సార్లు సంక్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించారు జైట్లీ. 2004-09, 09-14 సమయాల్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. భాజపా అధికారంలోకి వచ్చాక పార్టీని ప్రత్యర్థుల విమర్శల నుంచి కాపాడటం.. ఆయనకే చెల్లింది. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం సోషల్ మీడియా. ప్రధానంగా.. విమర్శకులకు బదులిచ్చేందుకు బ్లాగ్ను వినియోగించే ఆయన ఫేస్బుక్, ట్విట్టర్లోనూ చురుగ్గా వ్యవహరించేవారు.
రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ...
2014 నుంచి 19 వరకు భాజపా ప్రభుత్వంలో ఆర్థికం సహా పలు మంత్రిత్వ శాఖలను పర్యవేక్షించిన జైట్లీ... మోదీ 2.0 ప్రభుత్వంలో మంత్రివర్గానికి దూరంగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా మంత్రి పదవి వద్దనుకుంటున్నట్లు ప్రధానికి లేఖ రాశారు. అనంతరం.. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు.
అనారోగ్యంగా ఉన్నా... ఎప్పటికప్పుడు రాజకీయాంశాలపై చురుగ్గా ఉండేవారు జైట్లీ. వర్తమాన పరిస్థితులపై ఇంటి నుంచే బ్లాగ్, సామాజిక మాధ్యమాల్లో స్పందించేవారు. ఇటీవల పార్లమెంటులో తక్షణ ముమ్మారు తలాక్ నిషేధం, అధికరణ 370 రద్దు, కశ్మీర్ పునర్విభజనకు ఆమోదం సందర్భాల్లోనూ విపక్షాలకు దీటైన సమాధానాలిస్తూ.. ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'
ఆర్టికల్ 370 రద్దు జాతీయ సమైక్యత వైపు ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు జైట్లీ. ప్రత్యేక హోదా వేర్పాటువాదానికి దారితీస్తుందని.. ఈ పరిస్థితిని కొనసాగించడానికి ఏ దేశం అంగీకరించదని తన బ్లాగ్లో రాసుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయం జమ్ముకశ్మీర్ ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో లాభం చేకూరుతుందంటూ వరుస ట్వీట్లు చేశారు.
ఇదీ చూడండి: 'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'
ఎన్నికల సమయంలో మోదీ సామాజిక వర్గంపై ప్రత్యర్థులు విమర్శిస్తున్న తరుణంలోనూ ప్రధానికి అండగా నిల్చున్నారు జైట్లీ. మోదీ కుల రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని... ఆయనకు జాతీయవాదమే ఆదర్శమని ఆర్జేడీ నేత తేజస్వీ కామెంట్లకు బదులిచ్చారు జైట్లీ.
ఇదీ చూడండి: 'మోదీకి కుల రాజకీయ రంగు పులమొద్దు'
రఫేల్ వ్యవహారంలో భాజపాను ఆరోపణలు చుట్టుముట్టిన సమయంలోనూ కీలకంగా వ్యవహరించారు జైట్లీ. అసత్యాలు చెప్పడం కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దృష్టిలో ఓ హక్కేనంటూ ట్వీట్ల తూటాలు సంధించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రఫేల్ ఒప్పందాన్ని తప్పుపడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: 'అసత్యాలు చెప్పడం రాహుల్ దృష్టిలో ఓ హక్కు'
పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ మెరుపుదాడులపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగిన సమయంలో జైట్లీ స్పందించారు.
"ఆయన లెక్క ప్రకారం ఉగ్రవాదుల విషయంలో మేం చేసింది తప్పు. ప్రపంచంలో ఏ దేశమూ ఇలా చెప్పలేదు. ఇస్లామిక్ దేశాల సమాఖ్య మాట్లాడలేదు. పాకిస్థాన్ మాత్రమే ఆక్షేపించింది. ఆ దేశం మాటలను సమర్థించే వారు దేశంలోని రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. అది మన దురదృష్టం. గురువు ఎలా ఉంటే శిష్యులు అలాగే తయారవుతారు. "
-అరుణ్ జైట్లీ
ఇదీ చూడండి: మెరుపుదాడులపై మరోమారు దుమారం
ఇలా ప్రతి అంశంపైనా సోషల్ మీడియాలో స్పందిస్తూ... విమర్శల బాణం ఎక్కుపెట్టేవారు జైట్లీ. విపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీటినా.. ప్రత్యక్షంగా విమర్శించినా అరుణ్ జైట్లీ సామాజిక మాధ్యమాల వేదికగా వెంటనే బదులిచ్చేవారు. వారి కామెంట్లను దీటుగా తిప్పికొట్టేవారు.