జమ్ముకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపైనా వాదనలు విననుంది. కశ్మీర్లో కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్త తెహ్సీన్ పూనవల్లా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆర్టికల్ 370పైన తాను స్పందించడం లేదని, జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని మాత్రమే కోరుతున్నట్లు పూనవల్లా తెలిపారు. అలాగే మొబైల్ సేవలు, అంతర్జాల వినియోగం, న్యూస్ ఛానళ్ల రద్దు వంటి అంశాలపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని నిర్భంధం నుంచి విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఏ అధికారంతో వీరిని అధీనంలోకి తీసుకుందో సుప్రీం ప్రశ్నించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
మరిన్ని వ్యాజ్యాలు
పూనవల్లా పిటిషన్‌తో పాటు అనూరాధా భాసిన్ దాఖలు చేసిన ప్రత్యేక వ్యాజ్యం, కశ్మీర్లో విధించిన ఆంక్షలతో పాత్రికేయుల విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందన్న కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పిటిషన్‌పైనా సుప్రీం అత్యవసర విచారణ జరిపే అవకాశముంది.
నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేతలు మహమ్మద్ అక్బర్ లోన్, హోస్నన్ మక్సూస్ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రద్దు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు ఎన్సీ లోక్‌సభ ఎంపీలు.
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులపై న్యాయవాది మనోహర్ లాల్ శర్మ కోర్టు మెట్లెక్కారు. వీటన్నిటిపైనా అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది.