సార్వత్రిక సమరం తర్వాత దేశంలో మరో రసవత్తర పోరుకు ముహూర్తం ఆసన్నమైంది. సోమవారం జరగబోయే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.
288 అసెంబ్లీ స్థానాలకు గానూ 3 వేల 237 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 235 మంది మహిళలు. 8 కోట్ల 98లక్షల 39వేల 600మంది ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు.
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. దాదాపు 3లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షించనుంది.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
నియోజకవర్గాలు: 288
అభ్యర్థులు: 3,237
ఓటర్లు: 8,98,39,600
పోలింగ్ కేంద్రాలు: 96,661
భద్రతా సిబ్బంది: 3,00,000
పోలింగ్ సిబ్బంది: 6,500,000
వీవీప్యాట్ యంత్రాలు: 1,35,021
విజయంపై ఎవరి ధీమా వారిదే..
మహారాష్ట్రలో అధికార భాజపా.. శివసేనతో జట్టుకట్టి బరిలోకి దిగింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మోదీ ప్రజాకర్షణ, సుపరిపాలన, ఆర్టికల్ 370 రద్దు అంశాలు అనుకూలించి మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నది కమలదళం ధీమా. మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఈసారి తమకే పట్టం కడతారన్నది కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి విశ్వాసం.
ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో..
మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. పొత్తులో భాగంగా భాజపా 164 స్థానాల్లో, శివసేన 124 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించాయి. కొన్ని మిత్ర పక్షాలు భాజపా గుర్తుతో పోటీ చేస్తున్నాయి.
కాంగ్రెస్ 147 స్థానాల్లో.. ఎన్సీపీ 121 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 101 చోట్ల పోటీ చేస్తోంది. బీఎస్పీ 262 స్థానాల్లో, సీపీఐ 16, సీపీఎమ్ 8 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపాయి. 1400లకుపైగా స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ప్రముఖులకు పరీక్ష..!
నాగ్‌పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఫడణవీస్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ నాందేడ్ జిల్లా భొకర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పృథ్వీరాజ్ చవాన్ మరోసారి సతారా జిల్లాలోని కరాడ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, యువసేన సారథి ఆదిత్య ఠాక్రే ముంబయిలోని వర్లి నుంచి బరిలో ఉన్నారు. ఠాక్రే కుటుంబీకులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
పార్టీ | పోటీ చేసిన సీట్లు | గెలుపు | ఓట్లశాతం |
భాజపా | 286 | 122 | 28 |
శివసేన | 270 | 63 | 19.35 |
కాంగ్రెస్ | 280 | 42 | 18 |
ఎన్సీపీ | 282 | 41 | 17.20 |
ఇతరులు | 20 |
మహారాష్ట్ర ఎన్నికల ఫలితం ఈనెల 24న వెలువడనుంది.
ఇదీ చూడండి: 'మహా'పోరు: పైకి పొత్తులు... లోన కత్తులు!