రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి దంపతులపై దాడి ముంబయిలో కలకలం రేపింది. వర్లీలోని తమ టీవీ స్టూడియో నుంచి ఇంటికి వెళుతుండగా.. రాత్రి 12.15 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు ఆర్నబ్.
ఇద్దరు వ్యక్తులు తమ కారును అడ్డగించి ధ్వంసం చేస్తూ తీవ్రంగా దూషించారని ఆర్నబ్ ఆరోపించారు. వీరు యువజన కాంగ్రెస్ కార్యకర్తలుగా చెప్పుకొన్నట్లు తెలిపారు. దాడికి సంబంధించి ఎన్ఎం జోషి పోలీస్ స్టేషన్లో ఆర్నబ్ ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తనతో పాటు ఆయన భార్య సామ్యబ్రాతాకు గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
"నేను నా భార్య ఇంటికి కారులో వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి మమ్మల్ని అడ్డగించారు. వెనుక కూర్చున్న వ్యక్తి కార్ కిటికీ అద్దాన్ని పగలకొట్టేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవటం వల్ల తన వద్ద ఉన్న ఏదో ద్రావణాన్ని కారుపై చల్లాడు.
ఆ సమయంలో ఇద్దరు మమ్మల్ని దూషిస్తూ బెదిరించారు. వాళ్లు యువజన కాంగ్రెస్ కార్యకర్తలమని.. పార్టీ ముఖ్యులు నీకు గుణపాఠం నేర్పేందుకు మమ్మల్ని పంపారని వాళ్లు చెప్పారు. "
- ఆర్నబ్ గోస్వామి
'సోనియా గాంధీనే కారణం..'
అయితే దాడి జరిగిన తర్వాత.. 'యువజన కాంగ్రెస్ వర్ధిల్లాలి' కాంగ్రెస్ నేత అల్కా లాంబా ట్వీట్ చేశారు. ఫలితంగా తమపై దాడి చేసింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె అనుచరుల పనేనని అర్థమైనట్లు ఆర్నబ్ తెలిపారు.
మహారాష్ట్ర పాల్ఘడ్లో దాడులు సహా మరికొన్ని వ్యవహారాల్లో సోనియాను ప్రశ్నించటం వల్లనే ఇలా తనపై దాడి చేసి ఉంటారని ఆర్నబ్ తెలిపారు. చాలా మంది కాంగ్రెస్ నేతల బెదిరింపులు కూడా దీనికి బలం చేకూర్చుతున్నాయని ఆయన అన్నారు.
"వ్యక్తిగతంగా దీనికి కారణం సోనియా గాంధీ, వాద్రా కుటుంబమే. మీరే ఈ దాడికి బాధ్యత వహించాలి. నాకేదైనా జరిగితే సోనియా గాంధీదే బాధ్యత. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నకిలీ వార్తలు ప్రచారం చేస్తుంటే నేను ప్రశ్నించాను. గుజరాత్ కరోనా బాధితులపై నకిలీ వార్తలు సృష్టించేందుకు ప్రయత్నించగా మేం నిజాలను వెలుగులోకి తెచ్చాం. ఈ పరిణామాలు అన్నీ గమనిస్తుంటే సోనియా గాంధీ దగ్గరి వ్యక్తులే నాపై దాడికి పాల్పడినట్లు అర్థమవుతోంది."
- ఆర్నబ్ గోస్వామి
ప్రజాస్వామ్య విరుద్ధం..
ఆర్నబ్పై జరిగిన దాడిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు.
"ఏ పాత్రికేయుడిపైన దాడి జరిగినా ఖండించాల్సిందే. ఇది అప్రజాస్వామికం. ప్రస్తుత చట్టం ప్రకారం.. వాళ్లు ఫిర్యాదు చేసినట్లయితే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి