జమ్ముకశ్మీర్లో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ హిమపాతం వల్ల ఎంతో మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కశ్మీర్లో విధులు నిర్వహించే ఓ జవాను తన పెళ్లికే హాజరుకాలేకపోయాడు. వివాహం జరగాల్సిన సమయానికి హిమాచల్ ప్రదేశ్లోని తన ఇంటికి చేరుకోలేకపోయాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయినా వరుడు లేని కారణంగా వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
అసలేం జరిగింది...
హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లా కౌర్ ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ జమ్ముకశ్మీర్లో జవానుగా విధులను నిర్వహిస్తున్నాడు. జనవరి 16న కుటుంబసభ్యులు అతడికి వివాహాన్ని నిశ్చయించారు. కానీ కశ్మీర్లో విపరీతంగా కురుస్తోన్న మంచు వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అతను విమానాన్ని అందుకోలేకపోయాడు. దీంతో పెళ్లిని వాయిదా వేసినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
సునీల్ రాలేకపోయినందున ప్రస్తుతానికి పెళ్లిని వాయిదా వేసినట్లు జవాను సోదరుడు విక్కీ తెలిపాడు. రెండు కుటుంబాలు కలిసి మరో శుభముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇదీ చదవండి:'ఉరిమి' ఖడ్గ విద్యలో కేరళ యువకుడి ప్రపంచ రికార్డ్