హిమపాతంలో చిక్కుకున్న ప్రజలు ఎలా బయటపడాలనే దానిపై జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది సైన్యం. ఈ ప్రదర్శనలో మంచులో కూరుకుపోయినప్పుడు స్థానికులు చేయాల్సిన కసరత్తులను ప్రత్యక్ష్యంగా చేసి చూపించారు. భారీగా హిమపాతం కురిసిన వేళ పాటించాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్థులు ఎలాంటి వైద్య సహాయం పొందాలి అనే దానిపై చర్చించారు. తీగలు, పారలు ఏ విధంగా ఉపయోగించాలో చూపించారు.
"పీర్ పంజల్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో మంచు కురుస్తుంటుంది. అక్కడ భూభాగం కూడా అంత అనుకూలంగా ఉండదు. శీతాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాం."
-ప్రిన్స్ రోహిత్, లెఫ్టినెంట్ కర్నల్
నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువమంది స్థానికులు హిమపాతంలో చిక్కుకుపోతుంటారని.. అలాంటి వారికి ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి సైన్యం ప్రయత్నిస్తుందని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు సైన్యం వారి కోసం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
సైన్యం చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసించారు. ఇలాంటి శిక్షణ ప్రతీ ఒక్కరికీ అవసరమన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని తెలిపారు.
ఇదీ చూడండి: 'మంచు కురవడం వల్లే జలప్రళయం'