లద్దాఖ్‌లో చైనా దూకుడుపై కాంగ్రెస్ చేసిన విమర్శలను భాజపా దీటుగా తిప్పికొట్టింది. పొరుగుదేశాల కుట్రలను అడ్డుకొని భారత సైన్యం దేశ సమగ్రతను కాపాడుతున్నప్పటికీ.. ప్రతిపక్షం ఎందుకు కన్నీరు కారుస్తోందని మండిపడింది.
చైనాపై ఎప్పుడు కన్నెర్ర చేస్తారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలపై భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. మోదీ ఎప్పుడో చైనాపై కన్నెర్ర చేశారని.. కాంగ్రెస్ ఎందుకు తేమ కళ్లతో చూస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనా సమస్య ఒక పార్టీకి సంబంధించినది కాదని, మొత్తం దేశానిదని పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం, భారత సైన్యం ఉన్నంత వరకు దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టంచేశారు.
"మోదీతో పాటు సైన్యం, భారతదేశం మొత్తం చైనాపై కన్నెర్ర చేసింది. అందువల్లే భారత సార్వభౌమాధికారం చెక్కుచెదరకుండా ఉంది. ఎవరూ కూడా భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేయలేరు. దేశంలోని ప్రతి ఒక్కరు సైన్యం, మోదీపై నమ్మకం ఉంచారు.
లక్షిత దాడులు నిర్వహించి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు, లేదంటే శత్రువులపై దాడి చేసినప్పుడు రణదీప్ సుర్జేవాలా, రాహుల్ గాంధీ తేమ కళ్లతో చూస్తారెందుకు? మీరు ఆనందంగా ఉండాలి."
-సంబిత్ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి
తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి, ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు వందనం చేయాల్సిన అవసరం ఉందన్నారు సంబిత్ పాత్ర. రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో చైనా భారత సమగ్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేసిందని, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని స్పష్టంగా వివరించిందని గుర్తు చేశారు.
ఆ విషయం గ్రహించండి
మరోవైపు ఈ విషయంపై స్పందించిన భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. చైనాపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు. కూర్చొని చర్చలు జరిపే సమయం కాదని, భారత్ విషయంలో చైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ విషయం ప్రభుత్వం గ్రహించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: