జమ్ముకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినందున ఈ ప్రాంతంలో పరిస్థితులను సమీక్షించడం ఇప్పుడు సులభమని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతం పూర్తిగా కేంద్రం అధీనంలోకి వచ్చినందున రాష్ట్ర, కేంద్ర బలగాలతో మరింత సమన్వయంతో పనిచేయవచ్చన్నారు.
కశ్మీర్లో కేవలం ఆర్మీ మాత్రమే పనిచేయడం లేదు. ఇతర కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు దళాలు కూడా పనిచేస్తున్నాయి. వీరందరి సమన్వయంతో ఆర్మీ పనిచేస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా కేంద్రం అధీనంలోకి వచ్చింది కావున పరిస్థితులను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే వీలుంటుంది.
-జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్.
మత బోధకులతో మాటామంతీ
తీర్థ స్థలాల సందర్శనకై యాత్ర చేపట్టిన కశ్మీర్‌లోని రాజౌరీ, రీయాసీ ప్రాంతాలకు చెందిన వివిధ మత బోధకులను కలిశారు బిపిన్ రావత్. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి సహాయం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. లోయలో శాంతి నెలకొల్పేలా పనిచేయాలని వారికి సూచించారు. కశ్మీర్ యువకులను సాయుధ దళాల్లోకి తీసుకోవడానికి నియామక ర్యాలీలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
''జాతీయ సమైక్య యాత్ర చేపడుతున్న వివిధ మత బోధకులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కశ్మీర్లో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఉంటున్నారనడానికి ఇదొక ఉదాహరణ. మత గ్రంథాలలో ఉన్న విషయాలు సరిగ్గా ప్రజలకు బోధించగలిగితే సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొంటాయి. ఈ పని చేస్తున్న వారందరికీ నా అభినందనలు.''
-జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్.
శాంతియుతంగా జీవిస్తేనే సాధ్యం
భారత్‌లోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌కు ఎటువంటి తేడా లేదని అన్నారు రావత్. ఇతర ప్రాంతాల మాదిరిగానే కశ్మీర్ అభివృద్ధి ఫలాలను అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో కలిసిమెలసి జీవించగలిగితే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.