కరోనా వైరస్‌పై వదంతులను నమ్మొద్దన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేదానిపై తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ వదంతులపై దేశవాసులు దూరంగా ఉండాలన్నారు. నేడు భారతీయ జన్ఔషధీ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధీ పథక లబ్ధిదారులు, జన్ ఔషధీ కేంద్రాల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు మోదీ.
కరచాలనానికి సమయమిదే..
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కరచాలనం చెయ్యొద్దంటున్న వైద్యుల సూచనలు పాటించాలన్నారు మోదీ. కరచాలనాలకు బదులుగా మన సంప్రదాయమైన నమస్తేలను వినియోగించాలన్నారు. ఈ అలవాటును తిరిగి ప్రారంభించేందుకు ఇదే తగిన సమయమన్నారు.
6వేల జనరిక్ కేంద్రాలు..
దేశవ్యాప్తంగా 6వేల జన్ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు మోదీ. ఈ కార్యక్రమం ద్వారా రూ. 2000-రూ. 2500 కోట్ల మేర ప్రజారోగ్యం కోసం ఖర్చు చేశామన్నారు. జన్ ఔషధీ కేంద్రాల ద్వారా ప్రతి నెలా కోటి కుటుంబాల వైద్య అవసరాలు తీరుతున్నాయన్నారు మోదీ. పీఎం జన్ఔషధీ ద్వారా లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్రాల్లోని వైద్యులు జన్రిక్ మెడిసిన్లనే సూచించాలన్నారు.
"మరో వ్యక్తికి దూరంగా ఉండండి. మాస్కులు ధరించాలా వద్ద అనే విషయంలో వివిధ ప్రచారాలు ఉన్నాయి. కానీ దృష్టిలో ఉంచుకోండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే బిందువులతో అవి మరొకరిపై పడకూడదు. మాస్కులు ధరించే సమయంలో కూడా ఓ విషయం గుర్తుంచుకోండి. మాస్కులను సరిచేసేందుకు ఎక్కువగా ముట్టుకుంటూ ఉంటాం. దీని ద్వారా వైరస్ వ్యాప్తి అయ్యే అపాయం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇది తినొద్దు.. అది తినొద్దు అంటున్నారు. మరికొంతమంది ఇలాంటి ఆహారం తీసుకుంటే వైరస్ రాదంటున్నారు. మీ అందరికీ నా విజ్ఞప్తి. ఈ విధమైన వదంతుల నుంచి దూరంగా ఉండండి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!