రాష్ట్ర పోలీసులను సీబీఐ అగౌరపరిచిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష మంగళవారంతో మూడో రోజుకు చేరకుంది. కోల్కతా నగరం మధ్యలో ఉన్న మెట్రో ఛానల్ వద్ద మమతా ధర్నా చేస్తున్నారు. గతంలోనూ టాటా మోటార్స్ కర్మాగారం వివాదంలో 26 రోజుల పాటు ఇక్కడే ఉపవాస దీక్ష చేశారు.
మమత చేస్తున్న దీక్షకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. సీబీఐను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. భాజపా మాత్రం అవినీతికి మద్దతుగా దీక్ష చేస్తున్నారని విమర్శిస్తోంది.
నేడు సుప్రీం విచారణ
శారద స్కాంలో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను విచారణకు సహకరించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ విషయమై మంగళవారం సుప్రీం అత్యవసర విచారణ చేపట్టనుంది.
శారద చిట్ఫండ్ కుంభకోణంలో రాజీవ్ కుమార్కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని సుప్రీం కోర్టకు సీబీఐ తెలిపింది. కుంభకోణంలో రాజీవ్ పాత్ర ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, విచారణకు అతను సహకరించట్లేదని సీబీఐ ఆరోపించింది. కమిషనర్ వెంటనే లొంగిపోయి విచారణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది సీబీఐ.