ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, సరళతర వ్యాపార నిర్వహణ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో దిల్లీలో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఐదేళ్లలో దేశ అభివృద్ధి ఎలా ఉండబోతుందన్న దానిపై ప్రజలందరికీ ఓ అవగాహన ఉందని.. వారి అంచనాలకు తగ్గట్టుగా పని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. దీనిని ఓ సవాల్‌గా కాకుండా... ఓ అవకాశంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్‌ను అవతరింపజేసేందుకు ప్రతి శాఖ కృషిచేయాలన్నారు.
సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్ హాజరయ్యారు.
ఇదీ చూడండి: పాక్ కవ్వింపు చర్యలకు జవాను బలి