అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో దేశ ప్రజల దృష్టి అంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య వైపే ఉంది. అక్కడి తాజా పరిస్థితులు, బలగాల మోహరింపు వంటి కీలక అంశాలను తెలుసుకోవటంలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. శనివారం ఉదయం తుది తీర్పు వెలువరించనున్నట్లు వచ్చిన వార్తతో అయోధ్యవాసుల్లో ఆకస్మాత్తుగా ఆందోళన ఆవహించింది.
సుప్రీం తీర్పు ఏ విధంగా ఉండబోతుందో అనే చర్చల్లో మునిగిపోయారు ప్రజలు. తీర్పుపై ప్రకటన వెలువడిన క్రమంలో శుక్రవారం సాయంత్రం నగరంలో జన సందోహం ఉన్నప్పటికీ.. ప్రజల్లో ఆందోళన నిండి ఉన్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. శనివారం ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని.. కొందరు ముందుగానే నిత్యవసరాలు, ఔషధాలు కొనుగోలు చేసుకున్నారు. వారంతా ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.
తీర్పు ఏవిధంగా వచ్చినా నగరంలో శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ప్రముఖ హనుమంగర్హి ఆలయంలో పూజలు చేశారు ప్రజలు.
ముమ్మర తనిఖీలు...
అయోధ్య నగరంలోని ప్రముఖ హనుమంగర్హి ఆలయం, శ్రీరామ్ చికిత్సాలయ, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణాల్లో పీఏసీ జవాన్లుతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు అన్ని రకాల సెలవులను రద్దు చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: భాజపా-శివసేన మధ్య 'మహా' తూటాలు