ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువ ఐపీఎస్ అధికారి అంకితా శర్మ ఈమె. ఐపీఎస్ అయితే క్లాస్ ఎవరికి చెప్తోంది? ఎందుకు చెప్తోంది? అన్న ప్రశ్న తలెత్తుతోంది కదూ. తనలాంటి మరికొందరు ఉన్నతస్థాయి అధికారులను దేశానికి అందించేందుకు ఆమె ఇలా పాఠాలు చెప్తోంది.
" నేను ఎదుర్కున్న ఇబ్బందులు ఇంకెవరికీ రాకూడదన్న ఉద్దేశం నాది. కలలను సాకారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది."
- అంకితాశర్మ, సీఎస్పీ, కోత్‌వాలీ
ఇబ్బందులు పడకూడదని..
యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ప్రతి అభ్యర్థి కల. కానీ కొన్నిసార్లు సరైన మార్గదర్శకం లేక విజయం సాధించలేకపోతారు. ఇదే బాధను దుర్గ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన అంకిత కూడా అనుభవించింది. సరైన సూచనలు చేసేవారు లేక, పరిసరాల్లోని అభ్యర్థులెవరూ తనలా ఇబ్బందులు పడకూడదని.. వారికోసం గురువు అవతారమెత్తింది.
" ఆదివారాల్లోనూ ఏదైనా పని చేయాలని అనిపించింది. నేను పరీక్షకు సన్నద్ధమయే సమయంలో చెప్పేందుకు నాకెవరూ లేరు. ముందునుంచే సరైన మార్గనిర్దేశకులు ఉంటే పిల్లలు పరీక్షల్లో పొరబాట్లు చేయరు. ఈ పరీక్ష ప్రిపరేషన్ కోసం మనదేశంలో సరైన మాధ్యమాలు, సంస్థలు లేవు. అందుకే నేను చేయగలిగింది చేయాలని నిర్ణయించుకున్నా."
- అంకితాశర్మ, సీఎస్పీ, కోత్‌వాలీ
ప్రతి ఆదివారం..
ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తరగతులు చెబుతుంది అంకిత.
" క్లాసుకు చాలామంది అభ్యర్థులు వస్తారు. ఎంతమంది ఉంటారని నేనెప్పుడూ లెక్కపెట్టలేదు. గైడెన్స్ కోరుకునే అభ్యర్థులు ప్రతి ఆదివారం తన వద్దకు రావచ్చంటూ ఓసారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాను."
- అంకితాశర్మ, సీఎస్పీ, కోత్‌వాలీ
విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది..
అప్పటినుంచి క్లాసులకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్లాసులకు హాజరయే అభ్యర్థులకు..పుస్తకాలు ఎక్కువగా చదవమని సలహా ఇస్తుంది అంకిత. ఫలితంగా ఏకాగ్రత పెరిగి, క్రమంగా పూర్తిచేయగలమన్న ధైర్యం వస్తుందని చెప్తుంది.
" అభ్యర్థులు పుస్తకాల్లో నుంచి సందేహాలు అడుగుతారు. ఏయే పొరబాట్లు దొర్లుతాయో, వాటిని ఎలా తగ్గించుకోవాలో అడుగుతారు. గతేడాది ప్రశ్నపత్రాలు సహా... సబ్జెక్టుకు సంబంధించిన సవాళ్లు అడిగి, సమాధానాలు తెలుసుకుంటారు."
- అంకితాశర్మ, సీఎస్పీ, కోత్‌వాలీ
" అంకితాశర్మ మాకు ఆదర్శం. ఆమెతో మాట్లాడే, ఆమె క్లాసులు వినే అవకాశం వచ్చింది. ఇంటర్నెట్‌లో యూపీఎస్సీ అభ్యర్థులను అయోమయానికి గురిచేసే సమాచారమే ఎక్కువ. ప్రతిభావంతులు కూడా ఒక్కోసారి గందరగోళానికి గురవుతారు. అంకిత మేడం నా సందేహాలు లెక్కలేనన్ని సార్లు నివృత్తి చేశారు." - విద్యార్థి
" చాలా బాగా అనిపిస్తుంది. వారం మధ్యలో ఎప్పుడైనా వెనకబడినట్లు అనిపిస్తే.. ఆదివారం ఇక్కడికి రావడం వల్ల ఆ లోటు తీరిపోయినట్లు అనిపిస్తుంది. ఆమెను చూసినప్పుడు, కలిసినప్పుడు మేం కూడా ఆ స్థాయికి ఎప్పటికైనా ఎదగాలన్న స్ఫూర్తి కలుగుతుంది. పరీక్షకు సిద్ధమయే సమయంలో తలెత్తే చిన్నచిన్న సవాళ్లను అధిగమించేందుకు మేడం సహాయం చేస్తారు. ప్రతివారం ఇక్కడికి రావాలని అనుకుంటాను." - హిమాన్షి, విద్యార్థి
" మేడంను కలిస్తే సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఆమె స్థాయి వరకు మేమూ చేరుకోగలమన్న నమ్మకం కలుగుతుంది. చదువులోనే కాదు, వ్యక్తిగత విషయాల్లోనూ మాకు మద్దతుగా నిలుస్తారు. చిట్కాలు, సులభంగా అర్థం చేసుకునే మెళకువలు.. స్మార్ట్‌గా ఎలా నేర్చుకోవాలో చెబుతారు" - ఆయుష్ తివారి, విద్యార్థి
పోలీసు అధికారిగా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న అంకితా శర్మ.. సివిల్స్ ఆశావహు ల్లో ఆత్మవిశ్వాసం నూరిపోస్తూ, వారికి అండగా నిలుస్తున్నందుకు పోలీసు విభాగం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని అధికారులంతా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే వ్యవస్థల్లో సమూల మార్పులు వచ్చేందుకు ఎంతోకాలం పట్టదనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది అంకితా శర్మ.
ఇదీ చూడండి: ఎలాంటి ప్రమాదకర వ్యాధులైనా 'మడ్ థెరపీ'తో నయం