న్యూయార్క్‌లోని ఒక జంతు ప్రదర్శనశాలలో నాదియా అనే పులికి కరోనా సోకినట్లు వార్తలు రావడం వల్ల ప్రపంచం ఉలిక్కిపడింది. అక్కడ మొత్తం రెండు పులులు, మూడు ఆఫ్రికా సింహాలకు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. వీటి సంగతి అలా ఉంచితే పెంపుడు జంతువులకు నేరుగా ఈ వైరస్ సోకినట్లు శాస్త్రీయ ఆధారాల్లేవంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలో ఒకటో రెండో నమోదైన కేసులూ మనుషుల ద్వారా జంతువులకు వ్యాపించినవే.
మనుషుల నుంచి వీటికి..
* బెల్జియంలో పిల్లిని పెంచుతున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తర్వాత ఆ జంతువుల మలంలో వైరస్‌ను గుర్తించారు. ఆ పిల్లి వాంతులు చేసుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. యజమాని నుంచే దానికి వైరస్ సోకినట్లు భావిస్తున్నారు.
* హాంగ్‌కాంగ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ కన్జర్వేటివ్ డిపార్ట్‌మెంట్ వివరాల ప్రకారం ఒక జర్మన్ షెపర్డ్‌తోపాటు సమీపంలోని ఓ కుక్క కరోనావైరస్ బారిన పడింది.
కోతిపై పరిశోధన
'రీసెస్ మాకాక్స్' అనే జాతి కోతిని పరీక్షల నిమిత్తం కరోనా వైరస్ ప్రభావానికి గురిచేశారు. దీంతో ఆ కోతి బరువు తగ్గిపోయింది. దాని ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, కడుపులో వైరస్ పెరిగినట్లు గమనించారు. దీంతోపాటు ఆ కోతి తీవ్రమైన న్యుమోనియాకు గురైనట్లు గుర్తించారు. వైరస్‌కు స్థావరాలుగా మారే జీవులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేశారు.
ప్రముఖ సంస్థలు ఏం చెబుతున్నాయి?
* పెంపుడు కుక్కల నుంచి కరోనా వైరస్ సోకదని తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. హాంకాంగ్‌లో ఓ శునకానికి సోకినట్లు తెలిసిన తర్వాత దానిని తొలగించింది.
* అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మాత్రం జంతువులు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తాయనడానికి ఆధారాలు లేవని తెలిపింది.
* జంతువుల్లోకి వైరస్‌ను ఎక్కించి పరిశోధనలు చేశాం తప్ప పెంపుడు జంతువుల్లో సహజంగా వైరస్ సోకుతుందా? అనేది స్పష్టం కాలేదని బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్‌లో అసోషియేట్ ప్రొఫెసర్ ఉమా రమకృష్ణన్ తెలిపారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
* మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువుల బాధ్యతను మీ కుటుంబంలో మరొకరికి అప్పగించండి.
* మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాటిని నిమరడం, ముద్దుపెట్టుకోవడం, హత్తుకోవడం, మీరు సగం తిన్నవి వాటికి పెట్టడం చేయొద్దు. వాటిని శుభ్రంగా ఉంచండి.
* మీరు వాటిని తాకే ముందు, తర్వాతా చేతులు కడుక్కోండి. వాటికి ఆహారం పెట్టడం, వ్యర్థాలను తీయడం వంటివి చేశాక కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి.