వందలాది మంది జనం మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. అది చూసి అక్కడున్నవారంతా ఆనందోత్సాహాల్లో మునగితేలుతున్నారు. అయితే ఇదేదో బాక్సింగ్ పోటీలో.. రెజ్లింగ్ పోటీలో అనుకుంటే పొరపాటే.. ఇది పెరూ దేశంలోని ఆండియన్ కుస్కో జాతి ప్రజల సంప్రదాయం. అవును ఏటా కొత్త సంవత్సరం తొలిరోజున ఇలా కసితీరా కొట్టుకోవడం 'టాకనాకుయ్' అనే పండుగలో భాగమే.
సంప్రదాయమే..
టాకనాకుయ్ పండుగ గొప్ప సందేశాన్నిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాదిలోని వైరాలు, ద్వేషాలు, కష్టాలతో కసితీరా పోరాడి విజయం సాధించి కొత్త సంవత్సరంలో ఆనందంగా గడపాలన్నదే ఈ పండుగ సందేశం. ఇందుకు సంకేతంగా ఇద్దరు వ్యక్తులు కసితీరా పోట్లాడుకుని ఆ తరువాత ఇద్దరు కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకుంటారు. ఇది ఈ ఆటలోని నియమం కూడా.
పోట్లాట సమయంలో ఎవ్వరికీ గాయలు తగలకుండా చూసేందుకు కొందరు మత పెద్దలు కొరడా పట్టుకుని ప్రాంగణంలో తిరుగుతుంటారు. వారే పోటీలో మొదట పడిపోయిన వారని ఓడిపోయినట్లు ప్రకటిస్తారు.
ఆ తరువాత స్త్రీ పురుషులంతా కలిసి.. సంప్రదాయ హుయెలియా సంగీతానికి నృత్యం చేస్తారు. జంతువుల మృతదేహాలు, పక్షుల కలేబరాలు తమ తలపై ధరించి ఆనందంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు!
ఇదీ చదవండి: స్వర్ణ దేవాలయ సొబగులు.. వీక్షకులను కట్టిపడేసిన కాంతులు