అది 1939వ సంవత్సరం. పీవీ నర్సింహారావు రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఏడాది. జాతీయోద్యమ నినాదాన్ని అందుకున్న నర్సింహారావు ఆ సంవత్సరం త్రిపురలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యారు. ఆ సభలోని ప్రముఖుల ప్రసంగాలు పీవీని రాజకీయంగా చైతన్య పరిచాయి. ఇలా ఒక వైపు రాజకీయాలు.. మరోవైపు విద్యాభ్యాసాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు పీవీ.
ఏ విషయంలోనైనా.. తాను తీసుకునే నిర్ణయం సరైందా కాదా అని సందిగ్ధపడే సందర్భం ప్రతి మనిషికీ ఎదురవుతుంది. అది పీవీకీ జరిగింది. పీవీ తన భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవాల్సిన సమయం అది. అప్పుడు తనముందున్న మార్గాలు రెండే. ఒకటి.. న్యాయవాదిగా స్థిరపడటం. రెండోది.. రాజకీయాల్లో కొనసాగడం. తనలో తాను ఎన్నోమార్లు చర్చించుకున్న తర్వాత రాజకీయాల్లోనే కొనసాగాలని నిశ్చయించుకున్నారు పీవీ. 1951లో క్రీయాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
మంథని ఎమ్మెల్యేగా..
1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇదే ఏడాది కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1955-1977 వరకు మంథని ఎమ్మెల్యేగా పనిచేశారు. 1958-60 వరకు పబ్లిక్ అకౌంట్ సభ్యులుగా.. 1960-61లో విద్యా ప్రాంతీయ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
మంత్రిగా, ముఖ్యమంత్రిగా..
1962-64 కాలంలో నీలం సంజీవ రెడ్డి మంత్రి వర్గంలో న్యాయ జైళ్ల శాఖ మంత్రిగా...1964-67 వరకు అధికార భాషా సంఘం సభ్యులుగా పనిచేశారు. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్యరోగ్యశాఖ మంత్రిగా...1968-71 మధ్య విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరవాత.. 1971-73 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అసమ్మతితో కొంతకాలానికే ఆయన ప్రభుత్వం రద్దయిపోయింది. దీంతో పీవీ రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలిగారు.
కేంద్ర రాజకీయాల్లోకి..
రాష్ట్ర రాజకీయాలనుంచి తప్పుకున్న తర్వాత దిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించారు పీవీ. 1974లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులు కావడం వల్ల ఆయన కార్యక్షేత్రం దిల్లీకి మారింది. ఒక రకంగా అయనకు ఇది రెండో ఇన్నింగ్స్‌గా చెప్పవచ్చు.
నవోదయ విద్యాలయాల ఏర్పాటు
1977లో హనుమకొండ నుంచి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1978లో పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్‌గా పని చేశారు. 1980-84 వరకు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో కొంత కాలం పాటు కేంద్ర ప్రణాళిక మంత్రిగా.. ఆ తర్వాత హోంమంత్రిగా పనిచేశారు. 1985లో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985-88 వరకు మానవ వనరుల శాఖమంత్రి కొనసాగారు. ఈ కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. కొత్త కొత్త విద్యా విధానాలు తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. 1988లో కొంతకాలం పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అదే ఏడాది.. విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1989లో మహారాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
ప్రధాని అభ్యర్థిగా..
1989లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం వల్ల పీవీ.. క్రీయాశీలక రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పీవీ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయానికి ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. జూన్ 20వ తేదీన ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
దిల్లీ గద్దెపై తెలుగు పెద్ద..
దిల్లీ గద్దెపై తెలుగు పెద్ద కొలువయ్యారు. ఓ ఆంధ్రుడు తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత దశ. సాధారణ ఎన్నికల్లో పోటీ చేయని పీవీ.. 1991లోనే నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పూర్తి మెజారీటీ లేకున్నా ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు 1996లో ఒడిశాలోని బరంపురం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.