'అంపన్' తుపాను తీవ్రత, ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. హోంమంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో సమావేశమయ్యారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్... నేడు పెను తుపానుగా మారింది. ఇది ఈశాన్య బంగాళాఖాతం వైపు దూసుకెళ్తోంది. బంగాల్‌లోని దిఘా- బంగ్లాదేశ్ హైతీ మధ్య ఉన్న దీవుల వద్ద.. మే 20న తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 185.కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుపాను దెబ్బకు ఒడిశా, బంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర కోస్తాంధ్ర, తమిళనాడు, కర్ణాటకలలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అప్రమత్తమైన ఒడిశా సర్కార్
ఒడిశాలో ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మత్స్యకారులు మే 21 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. 12 తీర ప్రాంత జిల్లాల్లో పరిస్థితుల్ని నిశితంగా గమనించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అధికారుల్ని ఆదేశించారు. అలాగే, తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పైనా దృష్టిపెట్టాలన్నారు.
17 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
తుపాను తీవ్రత నేపథ్యంలో 17 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే ఒడిశా, బంగాల్‌లో పనిచేస్తున్నాయి. బంగాల్‌లోని ఏడు జిల్లాల్లో 7 బృందాలు, అలాగే, ఒడిశాలో 10 బృందాలను మోహరించారు. ఒక్కో బృందంలో 45 మంది సిబ్బంది ఉంటారు.