ఓబీసీలకు రాజ్యాంగ బద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వాలు 70 ఏళ్లు పెండింగ్‌లో పెట్టిన పనిని.. ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి చేశారని భాజపా అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. మహారాష్ట్రలోని బీడ్‌లో దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయం ద్వారా కశ్మీర్‌ను మోదీ భారత్‌తో అనుసంధానించారని తెలిపారు. భాజపా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. మోదీ అందిస్తున్న అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అమిత్ షా వెల్లడించారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్ల పాటు ఓబీసీ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
"గత ప్రభుత్వాలు 70ఏళ్ల వరకు ఓబీసీలకు రాజ్యాంగ హోదా ఇవ్వలేదు. మీరు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ ఓబీసీలకు రాజ్యాంగ హోదా ఇచ్చే పని పూర్తి చేశారు. ఓబీసీ సమాజం కోసం రాజ్యాంగ హోదాతో కూడిన ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసే పని చేశారు. ఈ రోజు వరకు ఆ పని ఎందుకు చేయలేదని ఓబీసీలతో రాజకీయాలు చేసే వారిని నేను అడుగుతున్నాను. నిరాదరణకు గురైన వారి అభివృద్ధి కోసం, ఓబీసీ సమాజం అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలో భాజపా ముందుకు సాగుతోంది." - అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు
ఇదీ చూడండి: 400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!