లోక్‌సభలో ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం సందర్భంగా పార్లమెంట్ దిగువసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సుదీర్ఘ సమాధానమిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్ ప్రజల మనసులు గెలుచుకుంటామని ఉద్ఘాటించారు. 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇన్ని రోజులుగా రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కశ్మీర్ ప్రజలను పేదరికంలో ఉంచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్న ఆయన 370 అధికరణ రద్దుతో అందరికీ రక్షణ లభించిందని ఉద్ఘాటించారు.
"ఇది చారిత్రక తప్పిదమని ఓవైసీ అన్నారు. ఇది చారిత్రక తప్పిదం కాదు... ఆ తప్పిదాన్ని సరిచేయడం... 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే మంచిదా.. లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది. వచ్చే ఐదేళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి కశ్మీర్లో జరుగుతుంది. ఈ ఆర్టికల్ రద్దు చేయడం వల్ల మంచి జరిగిందని కశ్మీర్ ప్రజలే చెబుతారు. 370 వల్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగింది. వేలమంది మృతి చెందారు. 370ని సమర్థించేవారు ఎస్సీలకు, గిరిజనులకు, మహిళలకు, అభివృద్ధికి, విద్యకు విరోధులు. 370ని సమర్థిస్తున్న వారు ఉగ్రవాదం, పేదరికానికి మద్దతిస్తున్నట్లే. నేనూ, మా నాయకుడు నరేంద్రమోదీ దీనిని ఎప్పుడూ సమర్థించలేం."
-అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి
అమిత్‌షా ప్రసంగంలోని మరిన్ని అంశాలు:
⦁ ఆర్టికల్ 370 రద్దు ద్వారా చారిత్రక తప్పు చేశారని అసదుద్దీన్ అన్నారు. మేం ఆ తప్పును సరిచేశామనే అంశం భావితరాలకు తెలుస్తుంది. వచ్చే ఐదేళ్ల మోదీ పాలనలో జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి చూస్తారు. ఆర్టికల్ 370 వల్ల ఎంత నష్టపోయామోనని కశ్మీర్ ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయం మంచిదా కాదా అనేది భవిష్యత్తు చెబుతుంది. 370 అధికరణ రద్దుపై ఎప్పుడు చర్చ జరిగినా ప్రజలంతా మోదీని గుర్తుచేసుకుంటారు
⦁ పీవోకే ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు. శాంతిభద్రతల కోసమే జమ్ముకశ్మీర్‌లో నిషేధాజ్ఞలు.
⦁ ఆర్టికల్ 370 వల్ల 70 ఏళ్లుగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటి?. కశ్మీర్ నష్టపోయేందుకు కారణం ఆర్టికల్ 370నే.
⦁ జమ్ముకశ్మీర్ వివాదాన్ని ఐరాస వద్దకు ఎవరు తీసుకెళ్లారు. భారత్‌లో కలిసిన తర్వాత కూడా నెహ్రూ ఐరాస వద్దకు తీసుకెళ్లారు. కశ్మీర్ సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. దేశంలో చిన్నపిల్లాడిని అడిగినా కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెబుతాడు.
⦁ 370 అధికరణం రద్దు నిర్ణయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన విషయం. ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ ఎంతకాలం కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందనే సందేహం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ కేంద్ర పాలిత ప్రాంతమే. అనంతరం రాష్ట్రంగా మారుతుంది. పాక్ ఆక్రమించిన పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమే.