కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా, రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీని విజయతీరాలకు చేర్చిన షా... కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత బాధ్యతలు చేపట్టారు.
దిల్లీ నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న 'అమిత్ షా'కు.. హోం కార్యదర్శి రాజీవ్‌గౌబా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌షాతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా కిషన్‌రెడ్డి, నిత్యానందరాయ్‌లు కూడా బాధ్యతలు స్వీకరించారు.
నూతన బాధ్యతల్లోకి..
గత ఎన్డీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్... తాజాగా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నూతన రక్షణ మంత్రిని త్రివిధ దళాధిపతులు.. బిపిన్ రావత్, బీఎస్ ధనోవా, కరమ్‌బీర్ సంగ్ మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షిస్తా..
పర్యావరణం, అటవీ, వాతావరణశాఖ మంత్రిగా ప్రకాశ్ జావడేకర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధినీ ఏకకాలంలో సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సహాయ మంత్రిగా బాబుల్ సుప్రియో బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా