రైతులతో బుధవారం జరిగే కీలక సమావేశానికి ముందు పలు కర్షక సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఎంపిక చేసిన రైతు సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మొత్తం 13 మంది రైతు నాయకులను చర్చలకు పిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాత్రి 8 గంటల తర్వాత చర్చలు ప్రారంభమైనట్లు వెల్లడించాయి. చర్చలకు హాజరైన వారిలో ఎనిమిది మంది పంజాబ్, ఐదుగురు దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాలకు చెందినవారని పేర్కొన్నాయి.
తొలుత అమిత్ షా నివాసంలో సమావేశం జరుగుతుందని భావించామని, అయితే ప్రస్తుతం పూసా ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయని పలువురు రైతు సంఘాల నేతలు తెలిపారు.
'ఒక్కటే డిమాండ్'
తమ డిమాండ్లపై రైతులు పట్టువీడని నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం బుధవారం చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ.. అంతకుముందే కొందరు నేతలతో సమావేశం జరగడం విశేషం.
అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశంలోనూ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌కు ఒప్పుకుంటారా లేదా అనే ప్రశ్నలే సంధిస్తామని సింఘు సరిహద్దులో నిరసన చేపట్టిన రైతు నాయకుడు రుద్రు సింగ్ మాంసా స్పష్టం చేశారు.
ఫలించని చర్చలు
సమస్య పరిష్కారానికై రైతులతో కేంద్రం ఐదు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి కర్షక నేతలతో కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. రైతుల డిమాండ్లపై చర్చించనున్నారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో రానున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది.
రాష్ట్రపతి వద్దకు విపక్షాలు..
మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నాయి. చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిపాయి.
ఐదుగురు నేతలు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతిని కలుస్తారని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ప్రతినిధి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విపక్ష పార్టీల తరపున హాజరుకానున్నట్లు వెల్లడించాయి.
ఇదీ చదవండి: 'అలా చేయకపోతే చైనాతో పోటీ పడటం కష్టమే'