లాక్డౌన్.. కరోనాపై పోరుకు దేశ ప్రజలను ఎక్కడిక్కడే కట్టిపడేసిన అస్త్రం. ప్రజలు కష్టపడకుండా చూసేందుకు.. తమ ప్రాణాలను పణంగా పెట్టి కొందరు దేశ సేవ చేస్తున్నారు. అలాంటి వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ ఒకరు. సెలవుపై ఉన్న ఆయన... డ్యూటీలో చేరి, దేశ సేవ చేసేందుకు 450 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇందులో 20 గంటల పాటు నడకే ఉండటం విశేషం.
పరీక్షల కోసమని...
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్‌లోని పాచోర్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ శర్మ కానిస్టేబుల్. బీఏ పరీక్షల కోసం ఈ నెల 16న తన స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటావాకు వెళ్లారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బీఏ పరీక్షలూ వాయిదా పడ్డాయి. అదే సమయంలో మోదీ లాక్డౌన్ ప్రకటించారు.
భారత్ క్లిష్టపరిస్థితుల్లో ఉందని.. తన సేవ దేశానికి ఎంతో అవసరమని గ్రహించిన దిగ్విజయ్.. ఎలాగైనా డ్యూటీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనను తన బాస్, పోచర్ పోలీస్ స్టేషన్ ఇస్పెక్టర్తో పాటు సొంత కుటుంబ సభ్యులూ వ్యతిరేకించారు.
అయినా.. దిగ్విజయ్ తన ఇంటి నుంచి బయలుదేరారు. దాదాపు 450 కిలోమీటర్ల ప్రయాణంలో 20 గంటల పాటు నడిచారు.
"ఈ నెల 25న ఉదయం కాలి నడకన నా ప్రయాణం ప్రారంభించా. దాదాపు 20 గంటల పాటు నడిచా. ప్రయాణం మధ్యలో కొందరు వాహనాల్లో చోటు ఇచ్చి సహాయం చేశారు. శనివారం రాత్రి రాజ్‌గఢ్‌కు చేరుకున్నా. దారిలో ఒక రోజు భోజనం కూడా దొరకలేదు. మిగిలిన రోజుల్లో కొన్ని సామాజిక సేవా సంస్థలు ఆహారం అందించాయి."
-- దిగ్విజయ్ శర్మ, కానిస్టేబుల్.
విధి నిర్వహణ పట్ల దిగ్విజయ్ అంకిత భావానికి అక్కడి పోలీసులు ఫిదా అయిపోయారు. కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం అందించాలని రాష్ట్ర డీజీపీకి సిఫార్సు చేశారు.
అయితే అంతసేపు నడవడం వల్ల.. దిగ్విజయ్ శర్మ కాలిలో బొబ్బలు వచ్చాయి. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన.
ఇదీ చూడండి:- కరోనా కర్ఫ్యూలో పేదల కోసం 'కుటుంబశ్రీ' నడక