పెళ్లి అనేది జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఆ వేడుక కోసం ఎందరో కలలు కంటారు. ఇక పెళ్లి కుదిరాక అయితే ఆ అరుదైన రోజు ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తారు కాబోయే భార్యభర్తలు. అయితే అలా తేదీలు నిర్ణయించిన పెళ్లిళ్లకు చెక్ పెట్టింది కరోనా వైరస్. దీనికి తోడు లాక్డౌన్ రూపంలో మరిన్ని రోజులు ఎదురుచూడండి అంటూ శిక్ష కూడా పడింది ఆ జంటలకు.
ఈ నేపథ్యంలో వాయిదా పడిన తన పెళ్లి కోసం వేచి ఉండలేక.. ఏకంగా 80 కిలోమీటర్లు నడుచుకుని కాబోయే భర్త ఇంటికి వెళ్లింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. తర్వాత తన అత్తామామల సమక్షంలోనే ఏడడుగులు వేసింది 19 ఏళ్ల గోల్డి.
ఇదీ జరిగింది..
కాన్పూర్ సమీపంలోని దెహత్ జిల్లా డేరా లక్ష్మణ్ తిలక్ గ్రామానికి చెందిన గోల్డి అనే యువతికి.. కన్నౌజ్ జిల్లా బైసాపుర్ గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. మే 4న పెళ్లి జరగాల్సి ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌తో వాయిదా వేశారు పెద్దలు. పలుమార్లు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో సహనం కోల్పోయిన ఆ యువతి.. ఎలాగైనా పెళ్లి చేసుకొని తీరాలని నిర్ణయించుకుంది. ఓ రోజు ఉదయం ఇంటి నుంచి కాలినడకన ప్రయాణం ప్రారంభించింది. 80 కిలోమీటర్లు నడిచి వరుడి ఇంటికి చేరుకుంది.
ఎలాంటి ఆడంబరాలు, బంధువులు లేకుండా అకస్మాత్తుగా వధువు ఇంటికి రావటం వల్ల ఆశ్చర్యానికి గురయ్యారు వరుడి కుటుంబ సభ్యులు. ముందుగా కూతురి కోసం వెతుకుతున్న గోల్డి తండ్రి గోరేలాల్కు సమాచారం అందించారు. సరైన ముహూర్తంలో బరాత్‌తో వచ్చి పెళ్లి చేస్తామని, అప్పటి వరకు వేచి ఉండాలని ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమె తండ్రి కూడా వేచి ఉందామని చెప్పినప్పటికీ.. అప్పటికే 80 కిలోమీటర్ల నడిచి అలసిపోయిన వధువు పెళ్లి చేసి తీరాలని పట్టుబట్టింది. దాంతో చేసేదేమి లేక వివాహానికి ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పెళ్లి తంతు పూర్తి చేశారు.