సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమాండర్లకు సూచించారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. ప్రతిక్షణం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. చైనా-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం తేజ్పూర్లోని 4 కార్ప్స్ను ఇటీవలే సందర్శించారు నరవాణే. ఆ సమయంలోనే కమాండర్లకు ఏ ఆపరేషన్నైనా నిర్వహించేందుకు సిద్ధమై ఉండాలని చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
రెండు రోజల పర్యటనలో తూర్పు కమాండ్కు వెళ్లారు సైన్యాధిపతి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల మోహరింపుపై కమాండర్లకు వివరించారు.
వాయుసేన వైస్ చీఫ్ సందర్శన..
లద్దాక్ సెక్టార్లోని ఫార్వర్డ్ ఎయిర్బేస్లను భారత వైమానిక దళ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరా శుక్రవారం సందర్శించారు. ఫార్వర్డ్ ఏరియాస్లో మోహరించిన యుద్ధ వాహనాల సన్నద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చినూక్, అపాచీ యుద్ధ విమానాల్లో ప్రయాణించారు.
చైనాకు దీటుగా తూర్పు లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి 40వేల బలగాలకుపైగా మోహరించింది భారత్. డ్రాగన్ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సర్వసన్నద్ధమైంది.
చర్చల్లో కుదిరిన పరస్పర అంగీకారం ప్రకారం ఫింగర్ ఏరియా ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు చైనా. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే తదుపరి అంశాలపై చర్చలుంటాయని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది.