రాజ్‌కుమార్ శుక్లా... చంపారన్‌కు చెందిన ఓ రైతు. స్వతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో ఉన్న నాయకులను కాదని... అక్కడి కఠిన పరిస్థితులను గాంధీకి వివరించి.. చంపారన్ రావాలని ఆహ్వానించారు. 1917 నాటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే .. భారత జాతీయ కాంగ్రెస్ ముందు వరుస నాయకుల్లో గాంధీ లేరు. అయినప్పటికీ గాంధీని ఆ రైతు ఆహ్వానించడానికి కారణం.. దక్షిణాఫ్రికాలో బాపూ సాధించిన విజయాలే.
గాంధీజీ తన ఆత్మకథలో చంపారన్ గురించి విశేషంగా రాశారు. చంపారన్‌లో తాను హింసను రూపుమాపానని పేర్కొన్నారు. భారత్‌లో మహాత్ముని నాయకత్వంలో సత్యాగ్రహానికి తొలి సాక్షిగా చంపారన్ నిలిచింది. 1917 'చంపారన్ సత్యాగ్రహం' యావత్ భారతావని స్వతంత్ర సంగ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఈ ఒక్క పరిణామంతో గాంధీ స్వతంత్ర ఉద్యమంలో, జాతీయ కాంగ్రెస్‌లో కీలక వ్యక్తిగా మారిపోయారు.
అక్కడేం జరిగింది..?
రాజ్‌కుమార్ శుక్లా విజ్ఞప్తి మేరకు చంపారన్ వెళ్లిన గాంధీ... అక్కడ సత్యాగ్రహాన్ని మొదలుపెడతానని ఊహించలేదు. అన్ని రోజులు అక్కడ ఉంటానని అనుకోలేదు. తన విద్యకు అక్కడ ఓ రూపం లభిస్తుందని గానీ, కస్తూర్ భాయ్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్ వంటి ముఖ్య నాయకులను అక్కడకు పిలుస్తానని గానీ, భవిష్యత్తులో చంపారన్ ముఖ్యపాత్ర పోషిస్తుందని గానీ, చంపారన్ వెళ్లడం సత్యాగ్రహం చరిత్రలో ఓ అధ్యాయం అవుతుందని గానీ ఏదీ ఆయన ఊహించలేదు.
సత్యాగ్రహం ఎలా పుట్టింది?
సత్యాగ్రహం అనే పదం ఎక్కడినుంచి పుట్టిందో గాంధీ తెలిపారు. ఆ పేరు పెట్టకముందే.. అక్కడ జరగాల్సిన నిరసన జరిగింది. ఎంతలా అంటే సత్యాగ్రహం అనే పదం ప్రపంచానికి వ్యాపించేటంతగా. సత్యాగ్రహం పుట్టుకను గాంధీ కూడా గుర్తించలేదు. వినయపూర్వక నిరసనగా మాత్రమే దాన్ని అందరూ గమనించారు.
దక్షిణాఫ్రికాలో ఇదే తరహా నిరసన జరిగింది. దానిని 'పాసివ్ రెసిస్టెన్స్' అనే అర్థం వచ్చేలా పిలిచేవారు. అయితే ఏదైనా కొత్త ఉద్యమానికి కొత్త పేరు అవసరం. ఈ 'పాసివ్ రెసిస్టెన్స్' అన్న పేరు గాంధీ నాయకత్వంలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఉద్యమానికి నిజమైన అర్థాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే భారతీయులు తమ ఉద్యమానికి ఓ సరికొత్త పేరు పెట్టడం అనివార్యమైంది. కానీ దానికి సరైన పేరును గాంధీ ఆలోచించలేకపోయారు. ఇందుకోసం 'ఇండియన్ ఒపీనియన్' పత్రిక ద్వారా పాఠకులకే ఆ నిర్ణయాన్ని వదిలేశారు. మంచిపేరు సూచించిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు.
ఆ బహుమతి మగన్‌లాల్ గాంధీని వరించింది. ఆయన సత్యం+ ఆగ్రహం కలిపి 'సదాగ్రహం' అనే పేరును సూచించారు. అయితే పూర్తి అర్థం వచ్చేలా గాంధీ 'సత్యాగ్రహం' అని పేరు ఖరారు చేశారు. అక్కడ పుట్టిన ఈ సత్యాగ్రహం ప్రపంచంలోని అన్ని అహింసా ఉద్యమాలకు సరైన అర్థంగా మారింది.
అభిప్రాయభేదాలు...
దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం తర్వాత గాంధీ నిజమైన ఆయుధాలు సత్యం, అహింస అని తేలాయి. సత్యాగ్రహంలో గాంధీకి ఎదురైన అసలైన సమస్య అహింస. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు, వాదోపవాదాలు వినిపించాయి. అయితే సత్యాగ్రహానికి మూలం అహింస అనడాన్ని చాలా మంది విభేదించారు. ఇప్పటికీ కొంతమందిది అదే వాదన.
వ్యతిరేక భావాలున్నవారు కూడా అహింసపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అతివాదులు, మితవాదులు కూడా ఇతర అంశాల్లో పూర్తి వ్యతిరేకులైనప్పటికీ దీనిపై ఎవరూ స్థిరమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన లాలా లజపత్‌రాయ్ కూడా అహింసా భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
1916 జులైలో కలకత్తా కేంద్రంగా నడిచే నెలవారీ పత్రిక 'మోడరన్ రివ్యూ'లో లాలా లజపత్‌రాయ్ మహాత్ముని 'అహింసో పరమో ధర్మ' సూత్రాన్ని ప్రశ్నించారు. ఆయన మాటల్లోనే...
"నాకు శ్రీ గాంధీ వ్యక్తిత్వంపై పూజ్యభావం ఉంది. నేను గౌరవించే ఎంతోమంది గాంధీని పూజిస్తారు. ఆయన సత్యంపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఆయన ఉన్నత అభిప్రాయాలను నేను ప్రశ్నించను. అయితే అహింస సూత్రాన్ని మాత్రం వ్యతిరేకించడం నా విధిగా భావిస్తున్నాను. చివరికి మాహాత్ముడైనా ఈ దేశ యువత మనస్సును విషపూరితం చేసేందుకు ఒప్పుకోను.
అహింస సూత్రం తప్పుగా దొర్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఓ వ్యక్తిని పిరికివాడిగా, ప్రతికూల వ్యక్తిగా, ప్రజ్ఞహీనులుగా తయారు చేస్తుంది. ఇది ఓ వ్యక్తిని అయోమయానికి గురిచేస్తుంది. అహింసను పరమ ధర్మంగా భావిస్తే భారత ఖ్యాతి, ధైర్యం, శౌర్యం తుడిచిపెట్టుకుపోతాయి. దేశభక్తి, జాతీయత, కుల గౌరవాలు మంటగలిసిపోతాయి. అనవసరమైన సందర్భాల్లో అహింసను ఉపయోగిస్తే హిందువులు సామాజిక, రాజకీయ, నైతిక బలాలు కోల్పోతారు."
- లాలా లజపత్‌రాయ్, స్వాతంత్ర్య సమరయోధుడు
1916 అక్టోబర్‌లో లాలా వ్యాఖ్యలపై గాంధీ ఇదే పత్రికలో స్పందించారు.
"లాలాజీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. అయితే అహింస వల్ల భారత ఖ్యాతి దెబ్బతింటుందన్న దాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే అహింస వల్ల మన ఖ్యాతి, బలం కోల్పోయామనడానికి చారిత్రక రుజువు, ప్రమాణాలు లేవు. 1500 ఏళ్లుగా మనం మన శౌర్యపరాక్రమాలను ప్రదర్శించామనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. అయితే అంతఃకలహాలు, స్వార్థ ప్రయోజనాలు దేశభక్తి కంటే ఎక్కువయ్యాయి. అహింసలో సత్యం, నిర్భయత్వం ముఖ్య అంశాలు. అహింసను పాటించాలంటే ఎనలేని ధైర్యం కావాలి. అందుకే పిరికివారికి అహింస ఓ గొప్ప ఆయుధమన్నది యదార్థం."
- గాంధీ, జాతిపిత
1936లో గొప్ప కవి సుర్యకాంత్ త్రిపాఠి నిరాలా రాసిన 'రామ్కీ శక్తి-పూజా' పుస్తకం ప్రచురితమైంది. 'అధర్ముల చేతిలో అధికారం.. ఓ అవినీతి అస్త్రంగా మారింది' అని సూర్యకాంత్ రాశారు. ఆయన నిజమైన అధికారం గురించి ప్రస్తావించారు. అధర్ములు, కృూరుల చేతిలో హింస ఒక అస్త్రంగా మారిందని పేర్కొన్నారు. అయితే నిరాలా దృష్టిలో నిజమైన శక్తి.. అహింసదే. దక్షిణాఫ్రికాలో అహింస శక్తిని గాంధీ నిరూపించారు. సత్యాగ్రహం అనే ఆయుధంతో పోరాడారు.
అహింసను అదిపెద్ద శక్తిగా గాంధీ భావించారు. అహింసను ధైర్యవంతులు, పిరికివాళ్లు, శౌర్యులు ఇలా ఎవరైనా వినియోగించవచ్చని చాటి చెప్పారు. గాంధీ తన ఆత్మకథలో చంపారన్ భూమిపై అహింసను ప్రయోగించాను అని చెప్పారు. దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాలపాటు అహింసతో గాంధీ ఉద్యమం చేసినప్పటికీ, చంపారన్‌లో మాత్రం చాలా ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
-(రచయిత- రాజీవ్ రంజన్ గిరి)
- ఇదీ చూడండి: గాంధీ 150: మామూలు మనిషి మహాత్ముడిగా ఎలా?