భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజం లేదని జస్టిస్ ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని అంతర్గత విచారణ కమిటీ తేల్చింది. ఈ కమిటీ నివేదిక ప్రతిని ఇవ్వాలని సీజేఐపై ఆరోపణలు చేసిన సుప్రీం మాజీ ఉద్యోగిని కోరారు. అయితే నివేదికను బహిర్గతం చేయబోమని ఇప్పటికే విచారణ కమిటీ స్పష్టం చేసింది.
జస్టిస్ ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ 14 రోజుల్లోనే సీజేఐపై వచ్చిన ఆరోపణలపై విచారణను ముగించింది. 3 రోజుల పాటు కమిటీ ముందు హాజరై, ఇక మీదట హాజరు కాబోనని తెలిపారు మాజీ సుప్రీం ఉద్యోగిని.
విచారణ కమిటీ నివేదిక కోరుతూ జస్టిస్ ఎస్.ఏ బాబ్డేకు మహిళ లేఖ రాశారు.
"విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయబోమని సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ కార్యాలయం ప్రకటించింది. ఇది న్యాయవ్యవస్థ మార్గదర్శకాలకు విరుద్ధం. నివేదిక ప్రతిని పొందే హక్కు ఫిర్యాదుదారుగా నాకు ఉంది. సీజేఐకు నివేదిక అందజేసే పరిస్థితి ఉంటే నాకూ ఇవ్వాలి. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు విచారణ నివేదిక ప్రతిని పొందే హక్కు ఫిర్యాదుదారునికి ఉంది. అంతర్గత విచారణ కమిటీ పారదర్శకంగా వ్యవహరించలేదు. నా ఆరోపణల్లో పసలేదని తేల్చిన కమిటీ నాకు నివేదిక ప్రతిని అందజేయాలి. ఎందుకు నా ఆరోపణలను తోసిపుచ్చారో నేను తెలుసుకోవాలి."
- సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళ
- ఇదీ చూడండి: మోదీ,షాపై సుప్రీంలో కాంగ్రెస్ మరో వ్యాజ్యం