హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని జిల్లా అధికారులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. కుటుంబ సభ్యులను 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలని కోరుతూ వేసిన హెబియస్ కార్పస్ రిట్‌ను కొట్టివేసింది.
జిల్లా అధికారులు తమను బంధించారని.. స్వేచ్ఛగా తిరగనివ్వట్లేదని ఆరోపిస్తూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అఖిల భారత వాల్మీకి మహాపంచాయత్ సంఘం జాతీయ కార్యదర్శి సురేందర్ కుమార్.. బాధిత కుటుంబం తరఫున ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జస్టిస్ ప్రకాష్ పాడియా, జస్టిస్ ప్రితీంకర్ దివాకర్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తున్నప్పుడు ఇలాంటి వ్యాజ్యాలను కోర్టు ప్రోత్సహించదని తేల్చి చెప్పింది.
"బాధిత కటుంబానికి తమకు కలిగిన అసౌకర్యాలపై పిటిషన్లు దాఖలు చేసే స్వేచ్ఛ ఉన్నప్పటికీ... జిల్లా పరిపాలన బాధ్యతగా రక్షణ కల్పిస్తున్నప్పుడు ఇలాంటి పిటిషన్‌ను కోర్టు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించదు. "
- అలహాబాద్ హైకోర్టు
అక్టోబర్ 1న ఇదే అంశంపై లఖ్‌నవూ హైకోర్టులో దాఖలైన సుమోటో పిటిషన్‌పై న్యాయస్థానం ఇదే తరహాలో స్పందించింది.
ఇదీ చదవండి: భళా విద్యార్థి: నీటిని శుభ్రం చేసే 'సైకిల్' ఆవిష్కరణ