ప్రజలే రాజ్యాంగ నిర్మాతలు. అధికారానికి వారే మూలం అనే విషయాల్ని భారత రాజ్యాంగ ప్రవేశిక (ప్రియాంబుల్) ప్రస్ఫుటీకరిస్తోంది. భారత దేశాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నది? ప్రజలకు కల్పించే హక్కుల విషయాల్ని ఇది విశదీకరిస్తోంది. ‘రాజ్యాంగ నిర్మాణ లక్ష్యాలు, ఆశయాలు’ పేరుతో రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశాల్లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన తీర్మానంలోని అంశాలు ప్రవేశిక రచనకు దిక్సూచిగా పనిచేశాయని చెబుతారు. మొత్తంగా భారత రాజ్యాంగం మౌలిక స్వభావానికి ప్రవేశిక దర్పణం పడుతుంది.
ఇదీ ప్రవేశిక
భారతదేశ ప్రజలమైన మేము 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని, మాకు మేమే సమర్పించుకున్నాం. దేశాన్ని ‘సర్వసత్తాక (సార్వభౌమాధికార), సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర’ రాజ్యంగా ప్రకటిస్తున్నాం.
రాజ్యాంగ లక్ష్యాలివీ..
దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం.
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛ;
సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించడం.
ప్రజల్లో వ్యక్తి గౌరవం, దేశ సమైక్యత, సమగ్రత భావాల పెంపు.
ప్రవేశికలో పేర్కొన్న పదాలు.. వాటి భావాలు
సర్వసత్తాక (సావర్నిటీ)
మన దేశం సర్వస్వతంత్రమైంది. సార్వభౌమాధికారం కలిగినది. దానిపై ఏ విదేశీ శక్తికి అధికారం లేదు. వివిధ అంతర్జాతీయ సంస్థలలో, దేశాల కూటములలో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ.. వాటి ఆధిపత్యం మనపై ఉండదు.
సామ్యవాద (సోషలిస్ట్)
ఆర్థిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించటం, వనరులను సామాజిక ప్రయోజనాలకు వినియోగించేటట్లు చేయడం.
లౌకికతత్వం (సెక్యులరిజం)
లౌకికతత్వం అంటే ‘మత ప్రమేయం లేని’ అని అర్థం. భారత ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుంది.
గణతంత్రం (రిపబ్లిక్)
ప్రజల లేదా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల వద్ద సర్వోన్నత అధికారం ఉండటం. ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వం అని అర్థం.