వ్యవసాయం, పెట్టుబడులపై దృష్టి సారిస్తే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సాకారమవుతుందన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా నిర్మల ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో తెలిపిన అంశాలన్నీ వాస్తవమేనని తెలిపారు.
"వ్యవసాయంలో పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య రంగాల ఎదుగుదల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని 2019 బడ్జెట్ చూస్తే ఆర్థమవుతుంది. ఈ బడ్జెట్లో చూపించిన అంచనాలన్నీ వాస్తవమే. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం వెనుక కచ్చితమైన ప్రణాళిక ఉంది. దేశంలో పెట్టుబడులు పెంచడమే ప్రస్తుత లక్ష్యం."
--- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి.
రక్షణ, పింఛను, జీతం, అంతర్గత భద్రత వ్యయాల కోసం బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేసినట్టు వివరించారు నిర్మల. ఇందుకోసం అవసరమైన పన్ను, పన్ను రహిత వనరులను సమీకరించినట్టు తెలిపారు.
బడ్జెట్లో వివిధ రంగాలకు సరిపడా కేటాయింపులు జరగలేదన్న విమర్శలను నిర్మల తిప్పికొట్టారు. నీటిపారుదల, పట్టణ రోడ్లు, తాగు నీరు, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో కేటాయింపులు పెరిగాయని వివరణ ఇచ్చారు. ఇవన్నీ సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపిస్తాయన్నారు.
మోదీ 2.0 సర్కారులో కొత్తగా ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్... జులై 5న లోక్‌సభలో రూ. 27,86,349 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఇదీ చూడండి:- చంద్రయాన్-2తో రోదసిలో మనది ప్రత్యేక ముద్ర!