కరోనా కొత్త రకం వైరస్ స్ట్రేయిన్ విజృంభణతో ప్రపంచానికి కొత్త కలవరం పట్టుకుంది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ వైరస్ పక్క దేశాలకూ వ్యాపించింది. బ్రిటన్ విమానాలపై ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. బ్రిటన్ విమానాలపై డిసెంబర్ 22 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు నిషేధం విధించింది. అలాగే.. ఓమన్ నుంచి విమానాల రాకపోకలు నిలిపివేసింది ఎయిర్ ఇండియా. మంగళవారం అర్ధరాత్రి నుంచి వారం పాటు ఈ నిషేధం అమలులో ఉండనుంది.
ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాల్లో యూకేకు చెందిన ప్రయాణికులను ఎక్కించుకోకూడదని స్పష్టం చేసింది కేంద్రం. బ్రిటన్‌కు చెందిన వారు లేరనే భరోసాను ప్రయాణికులకు కల్పించాలని తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేశారు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.
" పలు దేశాల్లో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం. యూకే నుంచి భారత్ వచ్చే అన్ని రకాల విమానాలపై డిసెంబర్ 22 నుంచి 31 వరకు తాత్కాలిక నిషేధం ఉంటుంది. భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలి. నెగటివ్ వచ్చిన వారిని కనీసం 7 రోజులు హోంక్వారంటన్లో ఉండేలా సూచించాలి. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ వంటి దేశాలు యూకేతో విమానా ప్రయాణాలను నిలిపివేశాయి. ఇతర దేశాల్లో కొత్త వైరస్ వ్యాప్తిపై సమాచారం అందితే.. ఆయా దేశాల విమానాలను రద్దు చేసే అంశంపై పరిశీలిస్తాం. "
- హర్దీప్ సింగ్ పూరీ, పౌరవిమానయాన శాఖ మంత్రి.
ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి..
యూకే విమానాలపై నిషేధం విధించిన కేంద్రం మంగళవారం అర్ధరాత్రిలోపు దేశానికి వచ్చే విమానాలపై సర్క్యూలర్ జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల్లో బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించింది.
ఈ క్రమంలో బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల జాబితా కోరింది కర్ణాటక ప్రభుత్వం. యూకే నుంచి వచ్చిన వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించింది.
ఐరోపా, పశ్చిమాసియా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 15 రోజుల క్వారంటన్‌కు వెళ్లాలని స్పష్టం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు హోంక్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది.
కువైట్‌కు విమాన సేవలు బంద్..
కొత్త రకం కరోనా ప్రబలుతోన్న నేపథ్యంలో వారం రోజుల పాటు అన్ని విమాన రాకపోకలు నిలిపివేసింది కువైట్. జనవరి 1 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. అయితే.. సరకు రవాణా విమానాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కథేంటి?