ఆన్‌బోర్డు ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగించి చంద్రయాన్ 2 వాహకనౌకను 276 x 71792 కిలోమీటర్ల కక్ష్యలోకి మార్చారు. ఆన్‌బోర్డులో ఉన్న ఇంధనాన్ని 989 సెకన్ల పాటు మండించడం ద్వారా ఇది సాధ్యమైందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆగస్టు 2న నాలుగోసారి..
తొలిసారిగా ఈ నెల 24న, ఆ తర్వాత జులై 26న చంద్రయాన్ కక్ష్యను పెంచారు. తాజాగా చంద్రయాన్ 2 జాబిల్లికి మరింత చేరువైందని ఇస్రో తెలిపింది. నాలుగో కక్ష్య పెంపు ప్రక్రియను ఆగస్టు 2న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చేపట్టనున్నట్లు వెల్లడించింది.
భారత అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఈ నెల 22న ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2ను మోసుకుంటూ జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం1 నింగిలోకి దూసుకెళ్లింది.
చంద్రయాన్-2’లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు పరికరాలు ఉన్నాయి. పరిశోధనల కోసం వీటిలో 13 పేలోడ్స్‌ను శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ ఏడాది సెప్టెంబరు 7న చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి 14 రోజులు పాటు (ఒక లూనార్ పగలు) పరిశోధనలు జరుపుతుంది.