భారత్‌లో ఈ నాలుగు రోజుల వ్యవధిలో కొత్తగా 25 కరోనా కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. వీరిలో 16 మంది ఇటలీ దేశస్థులని, మిగిలిన వాళ్లు భారతీయులని పేర్కొన్నారు. ఇటలీ నుంచి వచ్చిన దిల్లీ వ్యక్తి ఆగ్రాలో బంధువులు ఇంటికి వెళ్లగా, బంధువుల్లో ఆరుగురికి కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని మంత్రి తెలిపారు.
నోయిడాలో ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదని చెప్పారు. ఇటలీ దేశస్థుల్లో భార్యాభర్తలకు ఇద్దరికీ కరోనా సోకినట్లు తేలగా వారితో పాటు వచ్చిన మిగిలిన పర్యటకులను, వారికి సహాయకులుగా ఉన్న భారతీయులను ముగ్గురిని నిన్ననే దిల్లీలోనీ ఐటీబీపీ ఐసోలేషన్ క్యాంపునకు తరలించి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఓ భారతీయుడు సహా 14మందికి వైరస్ సోకినట్లు తేలిందని, మొదట్లో కేరళలో నమోదైన మూడు కేసులు కలుపుకొని మొత్తంగా భారత్‌లో నమోదైన కేసుల సంఖ్య 28కి చేరినట్లు స్పష్టం చేశారు హర్షవర్ధన్.
కరోనా కేసులు బయటపడిన చోట వాళ్లు ఎవరెవర్ని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి. కేసులు బయటపడిన ప్రాంతానికి 3 కిలో మీటర్ల దూరం వరకు పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులను ఇక్కడికి తరలించడంపై దృష్టి సారించామన్న హర్షవర్దన్.. అక్కడ కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. విదేశాల నుంచి ఇక్కడకి వచ్చిన వారిలో వైరస్ ఉన్నట్లు తేలితే ఆయా దేశాలు వారిని తమ దేశాల్లోని రానివ్వడం లేదని తెలిపారు మంత్రి. వారందర్నీ ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: లైవ్: దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు కాంగ్రెస్ నేతలు