హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన మతపరమైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా.. ఓ ఊరిలో ఒక్కరు మినహా గ్రామ ప్రజలంతారోనా బారినపడ్డారని అధికారులు తెలిపారు. లాహాల్ లోయలోని థొరాంగ్ గ్రామంలోని ప్రజలకు ఈ క్లిష్ట పరిస్థితి ఎదురైంది. 42 మంది ఉన్న ఆ గ్రామంలో 52ఏళ్ల భూషణ్ ఠాకూర్ మినహా మిగిలిన అందరికీ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ గ్రామం మనాలి-కెలాంగ్ జాతీయ రహదారికి సమీపంలో ఉంది.
'గత నాలుగు రోజులుగా నా భోజనం నేను వండుకుంటున్నాను. వేరే గదిలో ఉంటున్నాను. ఫలితాలు వచ్చే వరకు నేను నా కుటుంబంతోనే ఉన్నాను. కానీ.. కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాను. ఈ వ్యాధిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. శీతకాలం కావడం వల్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి' అని భూషణ్ చెప్పారు. అయితే.. కొద్ది రోజుల క్రితం ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్లే ఆ గ్రామస్థులందరూ వైరస్ బారినపడ్డారని ఆధికారులు ఆరోపిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 2.83% మందికి వైరస్
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహాల్-స్పితి జిల్లాలోని ప్రజలు కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ జిల్లాకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు చాలా మందికి వైరస్ సోకింది. ఫలితంగా స్థానికులు స్వీయ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభ్యర్థించారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, వాతావారణ మార్పులు ప్రస్తుత పరిస్థితికి కారణమని వెల్లడించారు. ఇక్కడ మొత్తం 31,500 మంది జనాభా ఉండగా.. ఇప్పటివరకు 890(2.83శాతం) మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వారిలో 479 మంది మహమ్మారిని జయించగా.. మరో 406 యాక్టివ్ కేసులున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 32,785 వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 491 మంది ప్రాణాలు కోల్పోయారు.
పర్యటకుల రాకపై ఆంక్షలు
వైరస్ కారణంగా మనాలి-కెలాంగ్ జాతీయ రహదారి సమీపంలోని లాహాల్ లోయలో చాలా గ్రామాలు కంటైన్‌మెంట్ జోన్లుగా మారాయి. ఈ నేపథ్యంలో పర్యటకుల రాకపోకలపై యంత్రాంగం ఆంక్షలు విధిస్తోంది. ఈ జోన్లలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటోంది.
ఇదీ చదవండి: 'కొవిడ్ సంక్షోభం నుంచి త్వరలోనే విముక్తి'