మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఐదుగురు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. వీరంతా 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను కొన్ని సంస్థలు సంరక్షిస్తున్నాయి. వీలిలో చాలా మంది క్యాన్సర్, శ్వాసకోశ, హృదయ, మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఈ సంరక్షణ సంస్థలు మార్చి 21న సంబంధిత అధికారులకు లేఖలు రాశాయి. మిగతా వారితో పోల్చుకుంటే.. 'భోపాల్' బాధితులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు ఈ బాధితుల కోసం 'భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్'ను కేటాయించారు.
బాధితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం...!
"అధికారులు బాధితుల కోసం నగరంలోని ఓ ఆసుపత్రిని కేటాయించారు. వారికి అక్కడే కరోనా చికిత్స అందిస్తామని కూడా చెప్పారు. అయితే ఇందులో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. గత 22 రోజులుగా వీరికి అత్యవసర సేవలు అందించడం లేదు."- రచ్నా ధోంగ్రా, ఓ ఎన్జీఓ సభ్యురాలు
ఏప్రిల్ 5న ఆసుపత్రిలోనే 55 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. ఏప్రిల్ 8న మరో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఏప్రిల్ 11న అతను కరోనాతో మృతి చెందినట్లు రిపోర్టు వచ్చింది. మరో ముగ్గురు బాధితులు కూడా ఇదే విధమైన కారణాలతో మరణించారు.
వీరి మరణాలకు ప్రధాన కారణం వైద్యుల నిర్లక్ష్యమని, బాధితులకు సరైన వైద్య సహాయం అందకపోవడం వల్లే మృత్యువాత పడ్డారని రచ్నా ఆవేదన వ్యక్తం చేశారు.
రిట్ పిటిషన్
భోపాల్ దుర్ఘటన బాధితుల కోసం ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎన్జీఓలు మధ్యప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి.
ఇండోర్‌లో...
మధ్యప్రదేశ్ పారిశ్రామిక నగరమైన ఇండోర్‌లో ఇవాళ కొత్తగా 117 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో నగరంలోని మొత్తం కేసుల సంఖ్య 544కు పెరిగింది. ఇప్పటి వరకు అక్కడ ఐదుగురు కరోనాతో మరణించారు.
ఇదీ చూడండి: 'మోదీజీ... గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని రప్పించండి'