మహారాష్ట్ర: రైలు ఢీ కొన్న ఘటనలో 16కు చేరిన మృతులు
మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సిన వలసకార్మికులు రైల్వే ట్రాక్‌లపై నిద్రిస్తున్న సమయంలో ఔరంగాబాద్ వద్ద గూడ్స్ రైలు వారిమీదుగా వెళ్లింది. 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌కు రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వళ్తున్న వలసకార్మికులు.. మధ్యలో అలసిపోయి రైల్వే ట్రాక్‌పై పడుకున్నారు. భుసావల్- జాల్నా మధ్య కర్మాడ్ వద్ద ఉదయం 5.15 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సమాచారం తెలుసుకున్న స్థానికులు, ఆర్పీఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలో జరిగిన రైలు ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
ఉపరాష్ట్రపతి విచారం
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ ఆవేదన..
రైలు ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రమాద విషయం తెలియగానే రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడిన మోదీ.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల హామీ ఇచ్చారు ప్రధానమంత్రి.
రైల్వేశాఖ వివరణ
రైలు ఢీకొని 16 మంది మృతి చెందిన ఘటనపై మహారాష్ట్ర రైల్వే అధికారులు స్పందించారు. తెల్లవారుజామున కొంతమంది కార్మికులను పట్టాలపై చూసిన వెంటనే గూడ్స్ రైలు లోకో పైలట్ రైలును ఆపడానికి ప్రయత్నించాడని వివరణ ఇచ్చారు. క్షతగాత్రులను ఔరంగాబాద్ హాస్పిటల్ తరలించినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.