వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీత మార్పులు, వాటి వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలపై ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచదేశాలను హెచ్చరించింది. తక్షణం అప్రమత్తం కాకపోతే పరిస్థితి చేయి దాటిపోవచ్చంటూ ప్రమాద ఘంటికలను మోగించింది. వాతావరణ మార్పులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాన్లు, వరదలు విలయ తాండవం చేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు, కరవులు సంభవిస్తున్నాయి. వీటివల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ప్రజా జీవనం అతలాకుతలమవుతోంది. దీనివల్ల దేశ ఆర్థిక పరిస్థితులపైనా ప్రభావం పడుతోంది. పరిస్థితులను ఇప్పటికైనా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకొనకపోతే, రానున్న రోజుల్లో ప్రపంచం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఐరాస హెచ్చరిస్తోంది.
ప్రమాద ఘంటికలు
ఇటీవల మహారాష్ట్రలో భారీవర్షాలు కురిశాయి. ఫలితంగా నాసిక్ ప్రాంతంలోని జలాశయాలకు పుష్కలంగా నీళ్లు చేరాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఆ ప్రాంతంలో కరవు తాండవించింది. తరవాత వరదలు ఊపేశాయి. తాజాగా ముంబయి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఇది వాతావరణ మార్పుల ఫలితమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ తూర్పుతీరంలో తుపాన్లు 2013 -2019 మధ్యకాలంలో గంటకు 140 నుంచి 260 కిలోమీటర్ల వేగంతో విధ్వంసం సృష్టించాయి. అదే సమయంలో భరించలేని వేడిగాలులు పలు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. 40 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హరియాణా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, చంఢీగఢ్, దిల్లీ, రాజస్థాన్, బిహార్ తదితర రాష్ట్రాలు సతమతమయ్యాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, అసోమ్‌లను వరదలు చుట్టుముట్టాయి. ఈ అసహజ పరిస్థితుల గురించి ప్రతిఒక్కరూ ఆలోచించాల్సి ఉంది.
ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సగటు ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కన్నా 0.8 డిగ్రీల సెంటీగ్రేడు చొప్పున పెరుగుతూ ఉంది. 1951 నుంచి 1980 వరకు సాధారణ సగటు ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెంటీగ్రేడు. 1990-2018 మధ్యకాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు (0.63 నుంచి 0.99 డిగ్రీల సెంటీగ్రేడులు) నమోదయ్యాయి. ఈ శతాబ్దం చివరి నాటికి వాతావరణ తాపం సాధారణ ఉష్ణోగ్రత కన్నా నాలుగు డిగ్రీల సెంటిగ్రేడుకు పెరుగుతుందని అంచనా. వచ్చే పది సంవత్సరాల్లో వాతావరణంలో హరిత వాయువుల విడుదలను 45 శాతానికి తగ్గించాలని, 2050 నాటికి పూర్తిగా హరిత వాయువులు లేకుండా చేయాలని 2015 నాటి పారిస్ ఒప్పందం తీర్మానించింది. రానున్న రోజుల్లో సగటు ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కన్నా 1.5 డిగ్రీల సెంటిగ్రేడు దాటకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను కోరింది. లేనట్లయితే ఎదురయ్యే విపత్తుల గురించి హెచ్చరించింది.
వినాశనానికి దారి
ప్రపంచ బ్యాంక్ (2019) తాజా నివేదిక ప్రకారం వాతావరణ తాపం వల్ల మంచు కరిగి సముద్ర తీరప్రాంతాలు ఉప్పు నీటిలో మునిగిపోతాయి. పొడి ప్రాంతాలు మరింత పొడి ప్రాంతాలుగా మారతాయి. తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఆహారభద్రత ప్రమాదంలో పడుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో వేడిగాలులు మరింత తీవ్రమవుతాయి. కరవులు, వరదలు, తుపాన్లు సంభవిస్తాయి. జీవవైవిధ్యానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది.
వర్షపాతం, వరదలు, కరవు, వేడిగాలులు వల్ల భూఉపరితల భాగం త్వరగా క్షయానికి లోనవుతుంది. ప్రపంచంలో 60 శాతం బొగ్గుపులుసు వాయువు ప్రధానంగా పెద్ద నగరాల నుంచే విడుదలవుతోంది. విపరీతమైన పట్టణీకరణ ఫలితంగా పచ్చదనం నానాటికి కొడిగడుతోంది. సిమెంట్ నిర్మాణాలు, వాహనాలు, శీతలీకరణ యంత్రాల వల్ల హరిత వాయువులు పెరిగి, అధిక ఉష్ణోగ్రతల నమోదుకు కారణమవుతున్నాయి. బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, శిలాజ ఇంధన యంత్రాలు, జీవ ఆధారిత పదార్థాలు హరిత వాయువుల విడుదలకు దోహదపడుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనల కోసం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలతో అధిక మోతాదులో హరితవాయువులు వాతావరణంలోకి వెళ్లడానికి, తద్వారా వాతావరణంలో తాపం పెరగటానికి ప్రధాన కారణమవుతున్నాడు.
మానవ తప్పిదాలే మాయని మచ్చలు
ఐక్యరాజ్యసమితి అంతర ప్రభుత్వాల వాతావరణ మార్పుల ప్యానెల్ (2019) తాజా నివేదిక ప్రకారం వ్యవసాయం, అటవీ నిర్మూలన, ఇతర మానవ కార్యక్రమాలు 70 శాతం వరకు భూఉపరితల భాగాన్ని మార్పులకు గురిచేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల వాతావరణంలో హరిత వాయువులు నానాటికీ పెరుగుతున్నట్లు గుర్తించారు. అందులో ప్రధానపాత్ర నేల వినియోగం. నేలను అసహజ కార్యక్రమాలకు కాకుండా ప్రకృతికి అనుకూలంగా ఉండే విధంగా, సక్రమమైన పద్ధతిలో వినియోగిస్తే చాలావరకు హరితవాయువులను అరికట్టవచ్చు.
పారిశ్రామిక విప్లవం నుంచి ఇప్పటివరకు మానవ కార్యక్రమాల మూలంగా 300 బిలియన్ టన్నులలో మూడింట రెండు వంతుల కర్బనం వాతావరణంలోకివిడుదలైంది. చెట్లను సక్రమంగా పెంచితే 205 బిలియన్ టన్నుల కర్బనాన్ని అవి తమలో నిల్వ ఉంచుకుంటాయి. ప్రస్తుతం 4.4 బిలియన్ హెక్టార్లలో చెట్లను పెంచడానికి అవకాశం ఉంది. ఇందులో ఇప్పటికే, 2.8 బిలియన్ హెక్టార్లలో చెట్లు ఉన్నాయి.మిగిలిన ప్రాంతంలో చెట్లను పెంచడానికి అనుకూలంగా ఉన్న భూమి 0.9 బిలియన్ హెక్టార్లు మాత్రమే. ఇది కూడా మూడింట రెండు వంతుల కర్బన వాయువులను పీల్చుకోగలదు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం ప్రస్తుతం గల చెట్ల సాంద్రత వాతావరణంలోని కర్బనాన్ని 2100 నాటివరకే పీల్చుకొనే అవకాశం ఉంది. అటవీకరణ, చెట్ల నిర్మూలనను తగ్గించడం తదితర కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాతావరణంలోని హరిత వాయువులు తగ్గుతాయి. భూతాపం తగ్గుతుంది. తద్వారా ఉపద్రవాలను నియంత్రించవచ్చు!
- ఆచార్య నందిపాటి సుబ్బారావు
రచయిత- భూవిఙాన శాస్త్ర రంగ నిపుణులు