భారత్‌లోకి ఉగ్రవాదాన్ని ఎగవేయడంపై పాకిస్థాన్ పన్నిన కుట్ర మరోసారి బయటపడింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ నిఘా సంస్థకు చెందిన డ్రోన్‌ను సైన్యం గుర్తించింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసేందుకే ఈ డ్రోన్‌ను వినియోగిస్తున్నట్లు సైన్యం అనుమానిస్తోంది.
తాజా సంఘటన నేపథ్యంలో డ్రోన్ల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్ పోస్టుల వద్ద ఉన్న తమ సిబ్బందికి సైన్యం సూచించింది. ఈ ఏడాది జూన్‌లో కూడా కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. ఈ డ్రోన్.. అత్యాధునిక తుపాకీ, ఏడు గ్రనేడ్లు, రేడియో సిగ్నల్, జీపీఎస్‌ను తీసుకువచ్చింది.
జమ్ముకశ్మీర్‌లో పని చేస్తున్న ఉగ్రవాదులు తీవ్రమైన ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నారని సైన్యం తెలిపింది. అందుకే సరిహద్దుల అవతల నుంచి వాటిని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని వెల్లడించింది.
ఇదీ చూడండి:- భారత్‌ను దెబ్బతీసేందుకు పాక్ 'అణు' కుట్రలు!