ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి.. కరోనా వైరస్. దీనిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా చేతులు శుభ్రం చేసుకోవడం ఓ ముఖ్యమైన పని. సబ్బుతో కాకుండా.. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. కానీ ఈ శానిటైజర్లను అతిగా వాడితే కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఎందుకు ప్రమాదం?
చేతులను శుభ్రం చేయడానికి వాడే ఈ శానిటైజర్లలో 60 నుంచి 90 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీని వల్ల చర్మం మండే అవకాశాలు ఎక్కువ. ఇతర సమస్యలూ వస్తాయి.
ఈ ప్రమాదం గృహిణులు, పిల్లల్లో అధికమని.. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) చెబుతోంది. ఆల్కహాల్ అధికంగా ఉన్న శానిటైజర్లు ఉపయోగించిన తర్వాత గ్యాస్ స్టవ్, అగ్గిపుల్లలు వెలిగిస్తే.. చేతులకు మంట అంటుకుంటుందని హెచ్చరిస్తోంది.
చిన్న పిల్లలకు ఇది మరింత ప్రమాదకరం. 0-5 ఏళ్ల పిల్లలు దీని వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదని సీడీసీ తెలిపింది.
పొరపాటున ఈ శానిటైజర్లతో నిండిన చేతులు.. వారి నోటికి చేరితే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. దీని వల్ల వాంతులు, విరోచనాలు, గొంతునొప్పి, కడుపునొప్పి సమస్యల బారినపడక తప్పదు. ఒక్కోసారి వీటి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కోమా, జీర్ణక్రియలో ఇబ్బందులు, తదితర సమస్యలూ ఎదురవుతాయి.
మరి ఏం చెయ్యాలి?
కరోనా వైరస్ను అరికట్టడానికి చేతులు పదేపదే శుభ్రం చేసుకోవడం ముఖ్యమే కానీ.. ఈ శానిటైజర్ల స్థానంలో ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలి. అందుకు సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ ' సామాజిక దూరం'