ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు అయ్మన్ అల్ జవాహరి భారత్‌లోని కశ్మీర్‌పై తొలిసారి వీడియో విడుదల చేశాడు. భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించి దేశం ఇబ్బందులు పడేలా ఆ దేశ సైన్యం, ప్రభుత్వానికి నిరంతరం సమస్యలు సృష్టించాలని ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం ఆల్‌ఖైదాకు నాయకత్వం వహిస్తున్నాడు జవాహరి.
" కశ్మీర్‌లోని సాయుధ ఉగ్రవాదులు ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైన్యం, ప్రభుత్వంపై అవిశ్రాంత సమస్యలు సృష్టించేందుకు ఒకే ఆలోచనతో ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించి మానవ వనరులు, పరికరాలకు తీవ్ర నష్టం కల్గించి ఇబ్బందులు పడేలా చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు సమాచారం పంచుకునేందుకు పటిష్ఠ ఛానళ్లను ఏర్పాటు చేయాలి. "
- అల్ జవాహరి, ఆల్‌ఖైదా నాయకుడు.
కశ్మీర్‌పై ఆల్‌ఖైదా విడుదల చేసిన తొలి వీడియోను 'అస్-సహబ్' ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను భద్రత సంస్థలు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులను ఏకం చేసే ప్రయత్నంగా ఈ దృశ్య సందేశం పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
వీడియోలో జవాహరి మాట్లాడుతున్న సమయంలో భారత బలగాల చేతిలో హతమైన ఉగ్రవాది జకిర్ మూసా చిత్రం కనిపించింది. కానీ మూసా అంశాన్ని జవాహరి ప్రస్తావించలేదు. భారత్‌లోని ఆల్‌ఖైదా విభాగం ' అన్సర్, ఘజ్వత్ ఉల్ హింద్'కి మూసా నాయకత్వం వహించాడు.
ఇదీ చూడండి: విషవాయువు లీకై 46 మంది ఆస్పత్రిపాలు