భాజపాతో చేతులు కలిపిన అజిత్ పవార్‌ను శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది ఎన్సీపీ. శరద్ పవార్ నేతృత్వంలో ముంబయిలోని వైబీ చవాన్ కేంద్రంలో సమావేశమైన శాసనసభాపక్షం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ కార్యక్రమానికి 50 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో అజిత్ పవార్ ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అజిత్ పవార్ పక్షాన ఉన్నారని ప్రచారం జరుగుతున్న ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంజయ్ బాన్సోడ్, బాబాసాహెబ్ పాటిల్‌లను శివసేన నేతలు సమావేశానికి తీసుకొచ్చారు.
జయంత్ పాటిల్‌కు బాధ్యతలు..
అజిత్ పవార్‌ను శాసనసభ పక్షనేత పదవి నుంచి తొలగించిన ఎన్సీపీ.. ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్‌కు అప్పగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఊహించని పరిణామాల మధ్య మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది భాజపా. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అయితే.. అది అజిత్ వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. భాజపాతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇదీ చూడండి: మహా : బాబాయ్ దీవెనలతో ఎదిగిన ‘దాదా’