దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకొంది. శుక్రవారం 208, శనివారం 222గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం నాటికి 256కి ఎగబాకింది. రెండో వారం ముగిసే సరికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్) అంచనా వేసింది.
వ్యర్థాల దహనమే కారణం
దిల్లీ శివార్లలోని ఆనంద్ విహార్, వాజీపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే ఏక్యూఐ 300కు చేరిందని తెలిపింది. పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల దహనమే తాజా వాయు కాలుష్యం పెరుగుదలకు కారణమని పేర్కొంది.
వ్యర్థాల దహనాన్ని నిషేధించిన ప్రభుత్వం
గత 3 నెలల్లో దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రకటించడం ఇదే తొలిసారి. రుతుపవనాలు, వాయు దిశ అనుకూలించడంతో ఆగస్టు, సెప్టెంబరులో గాలి నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది.
హరియాణా, పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాన్ని ప్రభుత్వం నిషేధించింది. కానీ, ప్రత్యామ్నాయ మార్గాల కోసం సరైన ఆర్థిక ప్రోత్సాహకాలు అందించకపోవడంతో రైతులు ఆ విధానాన్నే అనుసరిస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రధాని సోదరుడి కుమార్తె పర్స్ కొట్టేసిన దొంగలు అరెస్ట్