వాయు కాలుష్యం... ప్రపంచానికి పెనుముప్పుగా మారింది. లక్షల మంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. బయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యకోరల నుంచి తప్పించుకోలేపోతున్నాడు మనిషి.
వాయుకాలుష్యం వల్ల ఏటా దాదాపు 70లక్షల మంది చనిపోతున్నారనే భయంకర నిజం బహిర్గతమైంది. అందులో ఆరు లక్షల మంది చిన్నారులే. ఈ గణాంకాలను విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి పర్యావరణ, మానవ హక్కుల విభాగం.
ప్రపంచంలోని 600 కోట్ల మంది ప్రజలు కలుషిత గాలి పీల్చుకుంటున్నారని ఐరాస పర్యావరణ, మానవ హక్కుల విభాగ ప్రత్యేక నిపుణుడు డేవిడ్ బోయ్డ్ చెప్పారు. వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు.
గంటకు 800 మంది
" కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గంటకు 800 మంది చనిపోతున్నారు. చాలా మంది క్యాన్సర్, శ్వాసకోశ, గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు." -- డేవిడ్ బోయ్డ్
ఆరోగ్యకర వాతావరణాన్ని పొందే పౌరహక్కును చాలా దేశాలు కాపాడలేకపోతున్నాయని డేవిడ్ అన్నారు. 155 దేశాలు దీన్ని గుర్తించాయని, అన్ని దేశాలు కాలుష్యంపై తగిన చర్యలకు ముందుకు రావాలని కోరారు.
అన్ని చోట్ల..
వాయుకాలుష్యం అన్ని చోట్ల ఉందన్నారు డేవిడ్. రవాణా సాధనాలు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదకత, చెత్త యాజమాన్య పద్ధతుల్లో లోపాల వల్ల కాలుష్యం మరింత పెరుగుతోందని వెల్లడించారు.
బయట ఉన్నా... ఇంట్లో ఉన్నా ప్రజలు కాలుష్యం నుంచి తప్పించుకోలేకున్నారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళలు, పిల్లలు ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంటారని, వంట చేయడం, బయటి నుంచి వచ్చే పొగ, కిరోసిన్ దీపాలు వాడడం వంటి చర్యల వల్ల వారూ గాలి కాలుష్యం బారిన పడుతున్నారని చెప్పారు డేవిడ్.
చర్యలు తీసుకోవాల్సిందే
వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అన్ని దేశాలు తప్పక తీసుకోవాల్సిన 7 చర్యలను సూచించారు డేవిడ్.
ఐరాస సూచనలివే...
- ప్రభుత్వ యంత్రాంగాలు ఎప్పటికప్పుడు వాయు నాణ్యతను పరిశీలిస్తుండాలి.
- మనుషుల ఆరోగ్యంపై వాయు కాలుష్యం ఏ మేరకు ప్రభావం చూపుతుందో అంచనా వేయాలి.
- కాలుష్య తీవ్రత సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులతో ఎప్పటికప్పుడు సలహాలు ఇప్పించాలి.
- సురక్షితంగా పొగ రాకుండా వంట చేసే అధునాతన పద్ధతుల వైపు ప్రజలను నడిపించాలి. ఈ విషయంలో భారత్, ఇండోనేషియా ముందున్నాయి. వాటిని అనుసరించాలి.
- వంట చెరకు, బొగ్గు ఉపయోగించి వంట చేసే విధానాన్ని వీడేలా ప్రజలకు అవగాహన కల్పించాలి.
- గాలిలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి వంటి ప్రమాదకర వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.