బెంగళూరు విమానాశ్రయంలో ఓ వింత వివాదం చెలరేగింది. తన టిఫిన్ బాక్స్ విమానం ఎగరడానికి ముందే శుభ్రం చేయాలని పైలట్ ఆదేశించడం... ఆ విమాన సిబ్బందికి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరూ ఘాటు విమర్శలు చేసుకున్నారు. ఈ కారణంగా పైలట్లు వ్యక్తిగత భోజనం తీసుకురాకూడదని ఆదేశించనుంది ఎయిర్ ఇండియా.
"సోమవారం జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పైలట్లు వ్యక్తిగత భోజనం తీసుకురాకూదని ఆదేశించనున్నాం."
-ఎయిర్ ఇండియా ప్రకటన
బెంగళూరు నుంచి కోల్‌కతాకు ఉదయం 11.40 నిమిషాలకు బయలుదేరాల్సి ఉంది ఎయిర్ ఇండియా-772 విమానం. వివాదానికి కారణమైన పైలట్, సిబ్బంది ఒకరిని తొలగించడం వల్ల రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
"కెప్టెన్ తన టిఫిన్ బాక్స్ శుభ్రం చేయమని సిబ్బందిని ఆదేశించారు. ఇదే వారి మధ్య వివాదానికి కారణమైంది. విచారణ ప్రారంభమైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం."
-ఎయిర్ ఇండియా అధికారి
ఇద్దరు ఉద్యోగులను దిల్లీ లోని ప్రధాన కార్యాలయానికి పిలిచామని, గురువారం విచారణ చేస్తామని పేర్కొన్నారు.
విమాన పైలట్లు ప్రత్యేక భోజనానికి ఆదేశించకూడదని, కంపెనీ నిర్ణయించిన భోజనాన్నే స్వీకరించాలని మార్చి 27న ఎయిర్ఇండియా తమ సిబ్బందికి సూచించింది. బర్గర్లు, సూప్‌లు, సాల్మన్ చేపలు, వంటి ఆహారాన్ని పైలట్లు ప్రత్యేకంగా తెప్పించుకుంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: 'న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి'