సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న నిరసనలకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని రైతులు కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు రైతు సంఘాల్లో ఒకటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ).. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌లకు లేఖ రాసింది. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ఇటీవల పలు సందర్భాల్లో మోదీ, తోమర్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏఐకేఎస్‌సీసీ ఈ విధంగా స్పందించింది.
"రాజకీయ పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నిజానికి మా ఉద్యమం ప్రతిపక్షాల వైఖరిని మారేలా చేసింది."
-ఏఐకేఎస్‌సీసీ
ప్రధాని వ్యాఖ్యలు..
మధ్యప్రదేశ్ రైతులను ఉద్దేశిస్తూ శుక్రవారం చేసిన ప్రసంగంలో.. రైతు నిరసనలపై ఆరోపణలు చేశారు. ఈ ఆందోళనల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని.. కర్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. మంత్రి తోమర్ కూడా రైతులకు గురువారం రాసిన లేఖలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. చర్చ.. ప్రధాన సమస్యలపై జరగకుండా దారి మళ్లిస్తున్నారంటూ ఏఐకేఎస్‌సీసీ మంత్రి తోమర్‌కు రాసిన లేఖలో పేర్కొంది.
ఇదీ చూడండి : దుష్ప్రచారాలు నమ్మొద్దు: రైతులకు తోమర్ లేఖ