వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యులతోనే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం పళనిస్వామి నిలవనుండగా... ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.
ఇందుకు సంబంధించి అక్టోబర్ 7న పళనిస్వామి, పన్నీర్‌సెల్వం సంయుక్త ప్రకటన చేస్తారని పార్టీ సీనియర్ నాయకుడు వెల్లడించారు. అంతకుముందు జరిగిన పార్టీ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో.. ఈ ఇద్దరు నేతలకే సభ్యులు మొగ్గు చూపారని తెలిపారు. కరోనాపై పోరులో పళనిస్వామి కృషిని, ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం పాత్రను ఆయా నేతల మద్దతుదారులు ప్రశంసించారని పేర్కొన్నారు.
"ముఖ్యమంత్రి పదవికి సంబంధించి పన్నీర్‌సెల్వం ఎలాంటి డిమాండ్ చేయలేదు. ఆయన ఉపముఖ్యమంత్రి, పార్టీ సమన్వయకర్తగానే కొనసాగారు. ఇకముందు అలాగే ఉంటారు. ఎన్నికల్లో విజయం కోసం పార్టీ కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు."
- అన్నాడీఎంకే సీనియర్ నేత
జీఎస్టీ బకాయిల విడుదల, మెకేదాటు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని, నీట్ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానాలను సోమవారం జరిగిన సమావేశంలో ఆమోదించారు.
ఇదీ చూడండి: బిహార్ పోరు: సందిగ్ధంలోనే సీట్ల పంపకం